చేనేతపురిలో ఎవరు హీరో?

చేనేతపురిలో ఎవరు హీరో?
x
Highlights

చేనేత పూరీలో విజయశంఖారావం ఎవరిది చేనేతలకు నాయకత్వం వహించే నాయకుడు ఎవరు అభివృద్ధి మంత్రంతో ప్రచారం చేసిన అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారా వైసీపీ...

చేనేత పూరీలో విజయశంఖారావం ఎవరిది చేనేతలకు నాయకత్వం వహించే నాయకుడు ఎవరు అభివృద్ధి మంత్రంతో ప్రచారం చేసిన అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారా వైసీపీ గాలికి జనం సాహో అన్నారా ఫ్యాక్షన్‌ ఖిల్లాలో శాంతికాముకులుగా, విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ముందుండే, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టారు?

కర్నూలు జిల్లాలో ఉత్కంఠ కలిగిస్తున్న నియోజకవర్గం, ఎమ్మిగనూరు. అసెంబ్లీ పోరులో టీడీపీ, వైసీపీలు నువ్వానేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. తెలుగుదేశం అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి పోటీపడగా, వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి రంగంలోకి దిగారు. ఒకరేమో యువ నాయకుడు, మరోకరేమో కాకలు తీరిన రాజకీయ అనుభవజ్ణుడు. వీరిలో ఎమ్మిగనూరు జనం ఎవరికి పట్టంకట్టారన్నది అంతుచిక్కడం లేదు.

ఎమ్మిగనూరు నియోజక వర్గం 1955లో ఏర్పడింది. మొదటిసారి దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించి ముఖ్యమంత్రులు అయ్యారు. నియోజకవర్గం అధిక శాతం చేనేతలు నివాసం ఉంటున్న ప్రాంతం. చేనేతపురి ప్రశాంతకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు ఫ్యాక్షన్‌కు దూరం అభివృద్ధికి జై కొడతారు.

ఎమ్మిగనూరులో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 1,79,893 మంది ఓటు హక్కునువినియోగించుకున్నారు. టీడీపీకి పట్టున్న ఎమ్మిగనూరు పట్టణంలో పోలింగ్ శాతం తగ్గి, వైసీపీ కంచుకోట ఎమ్మిగనూరు రూరల్ లో 85.78%శాతం నమోదు కావడం, ఫ్యాన్‌ హవాను సూచిస్తోందన్నది స్థానికుల మాట. 2014 ఎన్నికల్లో ఎమ్మిగనూరు పట్టణం, నందవరం, గోనెగండ్ల మండలంలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. మరి ఈ ఎన్నికలలో ఎమ్మిగనూరు పట్టణంలో పోలింగ్ శాతం తగ్గడం టీడీపీకి కలసిరాని అంశంగా బేరీజు వేసుకుంటున్నారు నేతలు.

స్థానిక నేతలపై నియోజక ఓటర్లు కాస్త అసంతృప్తిగా వున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి తన పదవీ కాలంలో ఎమ్మిగనూరుకు దూరంగా ఉండటం, నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించలేక పోవడం, గ్రామస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించక పోవడం, తనపై కార్యకర్తలకు ఉన్న అసంతృప్తిని గ్రహించక పోవడం, టీడీపీకి కాస్త ఇబ్బంది కలిగించే పరిణామాలు.

వైఎస్సార్ పార్టీకి సైతం ఈ తిప్పలు తప్పటం లేదు. ఆ పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి తన పదేళ్ల పదవీకాలంలో ఎమ్మిగనూరు నియోజక అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ప్రజలు ఇప్పటికీ చర్చించు కుంటున్నారు. వయస్సు మీదపడటంతో అభ్యర్థి ప్రచారంలో పెద్దగా పాల్గొనక పోవడం. చేనేతలు ఎక్కువగా వున్న నియోజక వర్గంలో, ఆ వర్గంలో మంచి పట్టున్న, కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను కావాలనే ప్రచారంకు దూరంగా ఉంచడంతో చేనేతల్లో పార్టీ బాగా వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి నియోజకవర్గ ఓటర్ల ను అంతగా ఆకర్షించలేక పోయారు అన్నది విశ్లేషకుల వాదన.

జనసేన సైతం, ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చే ఛాన్సుంది. జనసేనకు మంచి నేతలు, క్యాడర్ ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో స్థానికేతరులకు టికెట్ కేటాయించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వీర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రేఖాగౌడ్‌‌కు ఎమ్మిగనూరు టికెట్ కేటాయించింది. అయితే కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ఆమెకు, చివరి నిమిషంలో ఎమ్మిగనూరు కేటాయించడంతో కాస్త ఇబ్బంది వాతావరణం ఎదుర్కొన్నారు. స్థానిక నేతల నుంచి ఊహించినంత సహకారం అందలేదు. గెలుపోటములపై ప్రభావం చూపించే అంతగా కాకపోయినా ఓ మోస్తరు ఓట్లను జనసేన చీలుస్తుందన్నది విశ్లేషకుల మాట.

మొత్తానికి అభివృద్ది సంక్షేమ పథకాలపైనే టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి ఆశలు పెట్టుకుంటే, జగన్‌ హవా, నవరత్నాలు, ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి భావన. జనసేన, కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా పోటీ చేస్తుండటంతో, ఈ రెండు పార్టీలు చీల్చే ఓట్లు ఎవరికి నష్టమన్నది అంతుపట్టడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories