స్నేహపూర్వక పోటీ కాస్త... ఆమీతుమీ దాకా వెళ్లిందా?

స్నేహపూర్వక పోటీ కాస్త... ఆమీతుమీ దాకా వెళ్లిందా?
x
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహాకూటమితో పొత్తు కుదరని కాంగ్రెస్‌ ఇప్పుడు బీఎస్పీపై కత్తులు నూరుతోంది. బీఎస్పీకి పట్టున్న 40 స్థానాల్లో తనదైన రాజకీయం చేస్తోంది....

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహాకూటమితో పొత్తు కుదరని కాంగ్రెస్‌ ఇప్పుడు బీఎస్పీపై కత్తులు నూరుతోంది. బీఎస్పీకి పట్టున్న 40 స్థానాల్లో తనదైన రాజకీయం చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఏనుగు పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంకాగాంధీ ఈ వ్యూహాన్ని అమలుచేస్తుందని బీఎస్పీ ఆరోపిస్తోంది.

యూపీలో ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. వారితో జతకట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించినా ఆ పార్టీకి సీట్లు ఇవ్వడం కుదరదని మాయావతి తెగేసి చెప్పేశారు. దీంతో అక్కడ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది ఒంటరి పోరాటంగా మారింది. తమ ఓట్లు కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు సునాయాసంగా బదిలీ అవుతాయిగానీ ఇతర పార్టీల ఓటు బ్యాంకు తమకు ఏమాత్రం కలిసిరాదన్న కారణంగా కాంగ్రెస్‌తో పొత్తుకు ముందుకు రాలేదని మాయవతే తేల్చిచెప్పారు.

మాయవతి వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ప్రియాంకాగాంధీ దళిత ఓటర్లు 20 శాతం, అంతకంటే ఎక్కువమంది ఉన్న 40 లోక్‌సభ నియోజకవర్గాలను గుర్తించారు. వీటిలో ఎస్సీ స్థానాలు 17 వరకూ ఉండటంతో మాయావతికి ఝలక్‌ ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. ఇప్పటికే చతికిలపడ్డ బీఎస్పీని మరింత బలహీనపరచవచ్చనీ మాయా ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయవచ్చన్నది ఆ పార్టీ ఉద్దేశం కావొచ్చన్నది విశ్లేషకులు మాట.

దళిత శక్తిగా మారుతున్న భీమ్‌ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రియాంక చేరదీయడం బీఎస్పీకి పుండు మీద కారం చల్లినట్టయింది. ఇది చాలదన్నట్టు మాయావతి మనిషిగా పేరున్న నసీముద్దీన్‌ సిద్దిఖీని కాంగ్రెస్‌ నాయకురాలు ఏరికోరి తమ పార్టీలో చేర్చుకుని, బిజ్‌నోర్‌ నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తాము కాంగ్రెస్‌ను కూటమిలో చేర్చుకోకపోయినా సోనియా, రాహుల్‌ పోటీ చేస్తున్న రాయ్‌బరేలి, అమేథీల్లో మహాకూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా పరోక్షంగా వారికి సహకరించామనీ కాంగ్రెస్‌ తమ పట్ల భిన్న వైఖరితో ఉందని బీఎస్పీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories