సిల్వర్‌స్క్రీన్‌ కెరీర్‌కి గుడ్‌బై

సిల్వర్‌స్క్రీన్‌ కెరీర్‌కి గుడ్‌బై
x
Highlights

క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ తన పవర్ స్టార్ అవతారాన్ని పక్కన పెట్టి, జనసేనాధిపతిగా జనం ముందుకు వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అజ్ఞాతవాసి సినిమా...

క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ తన పవర్ స్టార్ అవతారాన్ని పక్కన పెట్టి, జనసేనాధిపతిగా జనం ముందుకు వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అజ్ఞాతవాసి సినిమా ఇచ్చిన షాక్ నుంచి వేగంగానే తేరుకున్న పవన్ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నాడా ... సినిమాల్లో మళ్లీ ప్రయత్నించే కన్నా..ముందుగా రాజకీయంగా బలోపేతం కావాలని డిసైడ్ అయ్యారా..అందుకే ఛలోరే ఛలోరే చల్ యాత్రను చేస్తున్నారా..?కొండగట్టు యాత్రను చూస్తే అవుననే అనిపిస్తుంది.

పవన్‌కళ్యాణ్‌. ఆయన స్టైల్‌కే ఫిదా అయిపోతారు ఫ్యాన్స్. యూత్‌లో, మహిళల్లో పవర్‌స్టార్‌కున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే జనసేన పెట్టినా, జనంలోకి వెళ్లినా పవన్‌కళ్యాణ్‌కి ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు.
అలాంటి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రూట్‌ మార్చారు. సినిమాలకు ప్యాకప్‌ చెప్పి ఫుల్‌ టైమ్‌ పొలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. రీల్ లైఫ్ లో చెప్పే భారీ డైలాగులు రియల్ లైఫ్ లో ఫాలో చేసేందుకు సిద్ధమయ్యాడు. అటు సినిమా ఇటు రాజకీయాలను ఇన్నాళ్లు బ్యాలన్స్‌ చేసిన పవర్‌ స్టార్‌ ఇక మేకప్‌ తీసేసి పూర్తిగా జనంలోకి వచ్చేస్తున్నాడు.

గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేదిలాంటి హిట్స్‌ తర్వాత సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు పవర్‌స్టార్‌ని నిరాశపరిచాయి. పవన్‌ త్రివిక్రమ్‌ కాంబో అజ్ఙాతవాసి నిండా ముంచడంతో తన సిల్వర్‌స్క్రీన్‌ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనతో ఉన్నాడని టాక్. అయితే మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ మూవీకి కమిట్‌ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఏఎం రత్నం సినిమాకి కూడా పవర్‌స్టార్‌ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఈ రెండు మూవీలను పూర్తిచేయాలంటే కనీసం ఏడెనిమిది నెలలు కేటాయించాల్సి ఉండటంతో వాటిని పక్కన పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేన యాక్టివిటీ పెంచేందుకు, జనంలోకి చొచ్చుకుపోయేందుకు పవన్‌కళ్యాణ్‌ సినిమాలకు జనగణమణ పాడేసి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారు.

రాజకీయాల్లోకొచ్చిన కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి క్రియాశీలక రాజకీయాలపై ఆసక్తి తగ్గాక మళ్లీ మొహానికి రంగేసుకున్నారు. ఖైదీ నెంబర్‌ 150తో అమ్మడితో స్టెప్పులేసి బాక్సాఫీసుని కుమ్మేశారు. ఇప్పుడు సై..రా..అంటూ సిల్వర్‌స్క్రీన్‌మీద మీసం మెలేస్తున్నారు. అన్నే మళ్లీ క్రేజ్‌ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటే….ఊపుమీదున్న కెరీర్‌ని పవన్‌కళ్యాణ్‌ ఒక్కసారిగా వదిలేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఫుల్‌టైం పొలిటీషియన్‌గా ఉంటే తెలుగురాష్ట్రాల్లో జనసేన ఫ్యూచర్‌ ఏంటో తెలిసిపోతుందనీ…అదృష్టం కలిసొస్తే పొలిటికల్‌ కెరీర్‌ కంటిన్యూ చేసుకోవచ్చనీ…ఏదన్నా తేడావస్తే అన్నలాగే మళ్లీ రీఎంట్రీ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories