logo

జగన్ వ్యాఖ్యలపై తాను చెప్పాల్సిందేదో నేరుగా చెప్పేసిన పవన్

జగన్ వ్యాఖ్యలపై తాను చెప్పాల్సిందేదో నేరుగా చెప్పేసిన పవన్

రాజకీయ లబ్ది కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన పవన్ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని తన అభిమానులను కోరారు. అంతేకాకుండా జగన్ కుటుంబాన్ని కానీ వారి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. విధివిధానాల పరంగానే తన పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

తన పెళ్లిళ్ల విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. జగన్ వ్యాఖ్యలు తనను, తన అభిమానులను బాధించాయని తాను మాత్రం ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్న పవన్ రాజకీయ లబ్ది కోసం ఇలాంటి విషయాలను వాడుకోనన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన ఫ్యాన్స్‌ను కోరారు.

అయితే జగన్, పవన్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వ్యక్తిగత స్థాయికి మారడంతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పోస్టులపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వివాదంలోకి జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను, వారి ఇంటి ఆడపడుచులను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తానన్న స్పష్టం చేశారు.

అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన పవన్ ఎదురుదాడికి దిగారు. రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయిందని, మరిచిపోయిన మానవత్వాన్ని, జవాబుదారీతనాన్ని రాజకీయాల్లో మళ్లీ తీసుకురావడానికే జనసేన పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదని ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలన్నారు. అటువంటి ఆశయంతో ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని.. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరని చెప్పారు.

గట్టిగా ఐదేళ్లు కష్టబడితే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవచ్చనీ కానీ దానివల్ల సమాజంలో ఎలాంటి మార్పు రాదని పవన్ చెప్పారు. ఒక సామాజిక మార్పు కోసమే మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రస్తావిస్తూ.. తనను మెతక అనుకోవద్దని తాటతీస్తానంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే పవన్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు దళితుల భూముల పరిరక్షణ కోసం శనివారం ఒక్కరోజు దీక్ష చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో దీక్షలో కూర్చోబోతున్నారు. రాజధాని భూసమీకరణను, భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పవన్ రైతుల తరపున పోరాటం చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top