జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రూటు మారుస్తున్నారా...బహిరంగ ప్రకటన ఇవ్వడం దేనికి సంకేతం?

x
Highlights

ప్రత్యర్ధులపై పంచ్ లేస్తూ ఉర్రూతలూగించే ప్రసంగాలు చేసే వపన్ కల్యాణ్ ఇప్పుడు తన రూటు మార్చుకుంటున్నారా? ప్రత్యర్ధి సహనాన్ని పరీక్షిస్తున్నా.. సహనంతోనే...

ప్రత్యర్ధులపై పంచ్ లేస్తూ ఉర్రూతలూగించే ప్రసంగాలు చేసే వపన్ కల్యాణ్ ఇప్పుడు తన రూటు మార్చుకుంటున్నారా? ప్రత్యర్ధి సహనాన్ని పరీక్షిస్తున్నా.. సహనంతోనే అడుగులేస్తున్నారా? గతంలో అభిమానులను కంట్రోల్ చేయని పవన్ ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ చేయద్దంటూ బహిరంగ ప్రకటన ఇవ్వడం దేనికి సంకేతం?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రూటు మారుస్తున్నారా? దూకుడు కాదు సంయమనమే మేలని నమ్ముతున్నారా? రాజకీయాలు రచ్చగా మారుతున్న వేళలో సహనంతోనే ప్రత్యర్ధులను ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నారా? పవన్ రియాక్షన్ చూస్తే అలాగే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ పై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మరీ శృతి మించి, పరిధి దాటి వ్యక్తిగతంగా దాడి చేశారు. ఆ మాటలు విని యావత్ రాజకీయ వర్గాలు నివ్వెర పోయాయి.. పవన్ ను జగన్ అంత మాటలనడం చూసి పవన్ అభిమానుల మనసు నొచ్చుకుంది.. ఇక సోషల్ మీడియాలో జగన్ పై పవన్ ఫ్యాన్స్ ఎటాక్ మొదలు పెట్టారు.. అదే టైమ్ లో పవన్ స్పందించారు.. తనపై వచ్చిన విమర్శలకు తన అభిమానులెవరూ స్పందించొద్దంటూ కోరారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లొద్దని ప్రత్యేకించి జగన్ కుటుంబాన్ని నిందించొద్దనీ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.. తాను విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడ్డానని విమర్శకు ప్రతివిమర్శ సమాధానం కాదనీ పవన్ అన్నారు తాను ధర్మ బద్ధమైన, హేతుబద్దమైన రాజకీయాలు మాత్రమే చేస్తానన్నారు తన అభిమాను లెవరూ జగన్ వ్యాఖ్యలపై స్పందించద్దని జనసేన ప్రకటన ద్వారా పవన్ కోరారు జనసేన ఒక వ్యక్తిగా కాక ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కోరారు. వ్యక్తిగతాలపై మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, ఇకపై తాను పబ్లిక్ పాలసీలపై మాత్రమే స్పందిస్తానని తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవన్నారు. పవన్ తీసుకున్న ఈ వైఖరితో ఒక్కసారిగా రాజకీయం చల్లబడింది. పవన్ చూపి న ఈ చొరవ ఇప్పుడు ఆయనకు ప్రశంసలు తెచ్చి పెట్టింది.

పవన్ తన పార్టీని మాటల పార్టీ కాదు చేతల పార్టీ అని నిరూపించదలచుకున్నారా? అందుకే పార్టీకి మంచి పునాది వేసే ఉద్దేశంతోనే పర్యటనలు చేస్తున్నారా?పవన్ చేపట్టిన బస్సు యాత్రలు చాలా విభిన్నంగా సాగుతున్నాయి సినిమా పర్సనాలిటీకి భిన్నంగా గడ్డం పెంచి ఒక సీనియర్ పొలిటీషియన్ లా కనపడుతున్నారు.. అంతేకాదు.. తన దుస్తుల ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు.. ఆర్మీ డ్రెస్ లో ఒకసారి, తెల్లని దుస్తుల్లో ఒకసారి, మిలటరీ గ్రీన్ దుస్తుల్లో మరోసారి ఇలా రకరకాలుగా పవన్ అపియరెన్స్ కనిపిస్తోంది. ఒక డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతున్నారు. ప్రతీ ఏరియాలోనూ కొంత ఎక్కువ సమయం ఉండి స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అందుకు ఉత్తరాంధ్ర టూరే ఒక ఉదాహరణ.. ఉత్తరాంధ్రలో ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యపరిష్కారం కోసం ఒకరోజు దీక్ష చేపట్టారు..అంతే కాదు.. ఇతర స్థానిక సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు. ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉంటున్నారు. విద్యార్ధులు, మహిళలు, యువశక్తిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.. ప్రతీ చోటా వీర మహిళ పేరుతో జనసేన మహిళా విభాగం కార్యకర్తలతో మమేకమ వుతున్నారు.. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు యువకుల్లో మంచి నడవడిని, సత్ ప్రవర్తనను, సెన్సిబిలిటీని పెంపొందించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

బడా బడా పెద్దల దోపిడీ ముందు ఈ యువత చేసే తప్పు చాలా చిన్నదన్నారు. రాజ్యాధికారం ఎలా ఉంటుందో పాలకులకు సెన్సిబిలిటీ లేకపోతే సమాజం ఎలా తయారవుతుందో పవన్ తరచు తన ప్రసంగాల్లో చెబుతుంటారు.. అవినీతి, నల్లధనం, దోపిడీ వ్యవస్థలపై తీవ్ర విమర్శలు ఎక్కు పెడుతున్నారు.. తనకు రాజ్యాధికారంపై కాంక్ష లేదని, తనవల్ల సమాజానికి కొంతైనా మేలు జరిగితే అంతే చాలన్నది పవన్ ఉద్దేశం.జనసేనకు ప్రజల ఆదరణ దక్కేలా అన్ని విభాగాలను పటిష్టం చేసుకోడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

పవన్ కల్యాణ్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. ఆవేశం తగ్గించి ఆలోచింప చేసే విధంగా ప్రసంగించడం చూస్తుంటే పవన్ తన బాణీ మార్చుకున్నారనిపిస్తోంది. జనసేన అంతర్గత సమావేశాల్లో కూడా పవన్ ప్రసంగాల్లో నడవడి, ప్రవర్తన, క్రమశిక్షణ లాంటి వ్యక్తిగత నియమావళే ఎక్కువగా వినిపిస్తోంది.

అంతలో ఎంత తేడా? మొన్న మొన్నటి వరకూ పవన్ అంటే ఒక ఉద్రేకం.. ఒక ఎమోషన్.. ఒక ఉద్వేగం.. ఎదుటి మనిషి మనసును సూటిగా తాకే విధంగా ఆలోచింప చేసే విధంగా ప్రసంగాలు సాగేవి. ముందే ఏర్పాటు చేసిన బహిరంగ సభలకోసం పవన్ గట్టి కసరత్తు చేసేవారు యువతను తనవైపు తిప్పుకునేలా ప్రశ్నలు సంధిస్తూ ఆయన ప్రసంగాలు సాగేవి.

ఇక తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడినప్పుడూ ఆయన కొంచెం ఉద్రేకంగానే స్పందించారు వర్ధమా నటి శ్రీరెడ్డి పవన్ పై అనుచితంగా మాట్లాడినప్పుడు -మా- ఆఫీస్ కొచ్చి పవన్ ఆవేశంతో ఊగిపోయారు. పవన్ రాజకీయ అరంగేట్రానికి ముందు కూడా ఆయన ఆవేశంపై పెద్దగా జనానికి అవగాహన లేదు పవన్ ఆవేశానికి అర్ధం ఉండదనీ, ఆయన వ్యక్తిత్వానికి స్థిరత్వం లేదనీ పంచులు పడేవి చిరంజీవి చిన్న కు మార్తె శ్రీజ పెళ్లి వివాదంలో పవన్ కాస్త ఆవేశంగానే స్పందించారు తనను చూసి శ్రీజ భయపడుతోందన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు తన దగ్గరున్న లైసెన్స్ డ్ రివాల్వర్ ను పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు అప్పట్లో పవన్ ఆవేశం చూసిన వారు మరీ ఓవర్ గా రియాక్టయ్యారన్నారు..

సమాజం పట్ల స్పందించాలన్న పవన్ తపన ఈనాటిది కాదు 15 ఏళ్ల క్రితమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో పవన్ సినిమాల్లో బిజీ అయిపోవడంతో ఆ సంస్థ నిర్వహణ కష్టంగా మారి మూతపడింది ఇలా పవన్ కెరీర్ బిగినింగ్ లో ఆయన చర్యలను పెద్దగా జనం పట్టించుకునేవారు కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఎన్నికల ప్రచారం పేరుతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అంతటా తిరిగిన పవన్ కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ దూకుడుకు, ఆవేశానికి, ఆగ్రహం ఆ రేంజ్ లో ఉండేది మారుతున్న రాజకీయం, అనుభవం నేర్పిన పాఠం పవన్ ధోరణిలో మార్పు తెస్తోందా?

విభజన సమయంలోనూ, ప్రత్యేక హోదా పోరులోనూ పవన్ ప్రసంగాల్లో ఓ దూకుడు కనిపించేది...అంతులేని ఆగ్రహం, అసహం కనిపించేది..రాజకీయ పార్టీలను విమర్శించే టప్పుడూ ఆ టెంపో కనపడేది..కానీ రాను రాను పవన్ ప్రసంగాలు, కామెంట్లలో ఆవేశం స్థానంలో అనుభవం, పరిణతి కనిపిస్తున్నాయి.

పవన్ అభిమానులకు పవన్ కన్నా ఆవేశం ఎక్కువ పవర్ స్టార్ ను విమర్శిస్తే సహించేది లేదంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు పవన్ ఫ్యాన్స్... పవన్ ను విమర్శించినందుకే క్రిటిక్ మహేష్ పైనా, శ్రీరెడ్డిపైనా హద్దులు మీరిన ట్రోలింగ్ కు పాల్పడ్డారు పవన్ ఫ్యాన్స్..అప్పట్లో తన అభిమానులను పవన్ కంట్రోల్ చేయడం లేదన్న విమర్శలు పెరిగాయి. కావాలనే వారిని ఉసిగొల్పుతున్నారన్న భావన ఉండేది.. అప్పుడెప్పుడూ అభిమానులను నియంత్రించని పవన్ ఇప్పుడు జగన్ సహనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలు చేసినా మౌనంగానే బదులిస్తున్నాడు అసహనంతో రగిలిపోతున్న తన అభిమానులను సైతం కూల్ కూల్ అంటూ బుజ్జగించాడు వ్యక్తిగతాల జోలికొద్దు పబ్లిక్ పాలసీలనే విమర్శిస్తానంటూ ముందుకొచ్చారు. ఇది పవన్ లో వచ్చిన పరిణతికి నిదర్శనమా? పవన్ ఇకపై రాజకీయాలు ఇలాగే చేస్తారా? రాజకీయాల్లో సద్విమర్శలకు తావు కల్పిస్తారా? ఓ కొత్త ట్రెండ్ తీసుకొస్తారా?

జనసేనకు పవన్ కొత్త లుక్ తీసుకొస్తున్నారు జనసేన పార్టీ సమావేశాల్లో యువతను ఆలోచింప చేసే విధంగా ప్రసంగిస్తున్నారు సమస్య కాదు సమస్యకు మూలం గ్రహించాలంటూ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల సంగతెలా ఉన్నా రాబోయే కాలంలో మంచి తరాన్ని అందించాలన్న తపన మాత్రం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories