మా నిప్పునే అనేటంత మొన‌గాడా ప‌వ‌న్ క‌ల్యాణ్ : చ‌ంద్ర‌బాబు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 09:30
Pawan Kalyan Counter to Nara Lokesh | Janasena Formation Day

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం సాయంత్రం గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తనను, తన కుమారుడ్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేయడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి బుధవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీలో భారీ అవినీతి జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని సభలో పవన్ ప్రశ్నించారు. అంతేగాక, లోకేష్ కూడా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, అందుకే మోడీ కూడా అపాయింట్ ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయని అన్నారు పవన్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. 
పవన్.. ఆంతర్యమేంటి? ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, ప్రధాని నరేంద్ర మోడీని గానీ పల్లెత్తు మాట కూడా అనకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇంతగా అట్టుడుకుతుంటే, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతుంటే కేంద్రాన్ని పవన్ ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు.
 మమ్మల్ని ఆడిపోసుకోవడానికేనా? ‘ఈ సమావేశం నన్ను, లోకేష్‌ను, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే పెట్టినట్టుగా, ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తోంది. ఇంత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంటే మాకు అండగా ఉండాల్సింది పోయి, మమ్మల్ని గురి పెట్టి మాట్లాడటం ఎవరి ప్రయోజనాల కోసం?' అని పవన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 మమల్నే తిడతారా? రాష్ట్రంలోని రాజకీయశక్తులన్నీ ఏకమై కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేకహోదా, ఇతర ప్రయోజనాలు సాధించుకోవాల్సిన సమయమని, టీడీపీ ఎంపీలు పార్లమెంటులోను, బయటా పోరాటం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వంలోని మా మంత్రులతో రాజీనామా చేయించామని, తాము ఇంతగా పోరాడుతుంటే, తమనే తిట్టడమేంటి? అని చంద్రబాబు.. పవన్‌ను నిలదీశారు.
 పవన్.. సాక్షినే ఆధారమా? అంతేగాక, సాక్షి పత్రికలో వచ్చిన అంశాల్నే పవన్‌ ప్రస్తావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇన్ని రోజుల నుంచీ మేం పోరాటం చేస్తుంటే... పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడే మొదటిసారి మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇది ఎవరో ఆడిస్తున్న నాటకమా! అన్న అనుమానం కలుగుతోందన్నారు.
 పవన్‌పై గౌరవంతోనే.. ‘మేం కులాల మధ్య చిచ్చు పెడుతున్నామనడం అర్థరహితం. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు భంగం కలగకుండా రిజర్వేషన్లు ఇస్తామన్నాం. ఒక పద్ధతి ప్రకారం కమిషన్‌ వేసి, శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించాం. మత్స్యకారుల్ని ఎస్టీల్లో చేరుస్తామన్నదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే. పవన్‌ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అంటే మేనిఫెస్టోలోని అంశాల్ని సమర్థించినట్టే కదా?' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు వంటి సమస్యల్ని తమ దృష్టికి తెచ్చినప్పుడు పవన్‌పై ఉన్న గౌరవంతో సానుకూలంగా స్పందించామని చంద్రబాబు చెప్పారు.
 అలాంటి లోకేష్‌పై విమర్శలా? లోకేష్‌ బాగా చదువుకుని, ఒక సంస్థను నిర్వహిస్తూ కూడా ప్రజాసేవ చేయాలన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వస్తే పవన్‌ విమర్శలు చేయడం తగదని, డబ్బులు సంపాదించడానికి ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ఏటా తమ ఆస్తుల్ని పారదర్శకంగా ప్రకటిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. పవన్‌ ఒక్కో సభలో ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, ఇదంతా ఒక్కో సినిమాకు ఒక్కో రచయిత మాటలు రాసినట్టు ఉందని వారు ఎద్దేవా చేశారు.
 బాబు, పవన్‌కు పూర్తిగా చెడినట్లేనా? కాగా, ఈ స్థాయిలో చంద్రబాబు.. పవన్‌పై తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. పవన్ కూడా నిన్నటి వరకు చంద్రబాబుపై ఇంత తీవ్రంగా విమర్శలు చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లేనని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉండదని స్పష్టమైపోయింది.
 

English Title
Pawan Kalyan Counter to Nara Lokesh | Janasena Formation Day

MORE FROM AUTHOR

RELATED ARTICLES