40మంది ఎమ్మెల్యేల అవినీతి నా దృష్టికి వచ్చింది

Submitted by arun on Mon, 03/19/2018 - 18:02
pk

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా మాట్లాడిన పవన్‌‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన పవన్‌ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్‌ ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. 40మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి తన దృష్టికి వచ్చిందన్నారు. స్వయంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతిని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అయితే తాను ఎన్నిసార్లు చంద్రబాబుకి చెప్పినా పట్టించుకోలేదని, అందుకే నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబుకి తెలిసే అవినీతి జరుగుతోందన్నారు.

పోలవరం ప్రాజెక్టులోనూ భారీగా అవినీతి జరుగుతోందని పవన్‌ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు. పోలవరంలో అసలేం జరుగుతుందో కేంద్రం పర్యవేక్షించాలన్నారు. పోలవరం పనులను ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు ఇవ్వడం వెనుక ఏదో మతలబు ఉందన్నారు. కేసీఆర్‌తో పోలిస్తే చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్న పవన్‌‌ కేసీఆర్‌‌కి పదికి 6 మార్కులిస్తే బాబుకి రెండున్నర మార్కులే ఇస్తానన్నారు. మంత్రి లోకేష్‌‌తోపాటు దాదాపు 40మంది టీడీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలున్నాయన్న పవన్‌‌ వారిపై కేంద్రం విచారణ జరపాలని కోరారు.

అయితే ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్‌ యూటర్న్‌ తీసుకున్నాడు. హోదా సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న జనసేనాని.... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కానే కాదన్నారు. పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్ధిక సాయం అందడమే ముఖ్యమన్నారు. అయితే పవన్‌ మాటలను జాతీయ మీడియా తప్పుగా అర్ధంచేసుకుందంటూ జనసేన ట్వీట్‌ చేసింది. ప్రత్యేక హోదా సాధనకు జనసేన కట్టుబడి ఉందని ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. 

English Title
Pawan Kalyan Comments On Chandrababu & TDP MLAs

MORE FROM AUTHOR

RELATED ARTICLES