logo

నిజంగా జనసేనపై కులముద్ర వేసే కుట్ర జరుగుతోందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, పోరాట యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతా తిరుగుతున్నారు. భారీగా జనం తరలివస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు, కొండాకోనల్లోని గిరిజనుల దగ్గరకూ వెళ్లి అందర్నీ పలకరిస్తున్నారు పవన్. తెలుగుదేశం ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయి అవినీతి పాలన సాగుతోందంటూ చెలరేగిపోయి మాట్లాడారు. దీంతో తెలుగుదేశం నాయకులు కూడా పవన్‌పై విరుచుకుపడుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

అయితే మొన్నటివరకు ఎన్నికల వాగ్ధానాలు, పాలనపై తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య డైలాగ్ వార్ సాగింది. కానీ ఈ మాటల యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. నువ్వు పలాన కులం ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నావంటూ పవన్‌పై టీడీపీ నేతలు ఘాటుగా మాట్లాడుతున్నారు. కేవలం కాపు వర్గం ఓట్లే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చావంటూ, పవన్‌ను ఒక వర్గానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై పవన్‌ ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. జనసేనపై కులం ముద్ర వేస్తే, కాళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించారు.


అన్ని రాజకీయ పార్టీలు కుల వివక్షలను విమర్శిస్తాయి. కుల ప్రస్తావనలేని సమాజం కావాలంటాయి. కానీ వాటి పునాదులు మాత్రం, కులం మూలాలపైనే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పార్టీలనే తీసుకుంటే, ఒకప్పుడు కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యమే కనిపించేంది. ఇప్పుడా వర్గం మొత్తం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు మళ్లింది. అలాగే తెలుగుదేశం కూడా, ఎన్టీఆర్‌ హయాం నుంచే కమ్మ వర్గం బలమే నడిపిస్తోందంటారు. ఏపీలో కమ్మ, రెడ్డిల మధ్య అధికార మార్పిడి జరుగుతుంటుందని సామాజికవేత్తలు విశ్లేషిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్ల తర్వాత, అత్యంత బలమైన మరో సామాజికవర్గం కాపు. కమ్మరెడ్ల మధ్య పవర్‌ షేర్‌ అవుతున్నా, ఇఫ్పటివరకు కాపు వర్గానికి అధికారం దక్కలేదు. అంతటి బలమైన నాయకుడు, ఆ వర్గంలో అవతరించలేదు. దీంతో 2004లో చిరంజీవి ఆ అందని ద్రాక్షను అందుకునేందుకు ప్రయత్నించారు.

చిరంజీవికి అన్నివర్గాల అభిమానమున్నా, ఆయనను మాత్రం కాపు వర్గం ఓన్‌ చేసుకుంది. ఎస్సీ, బీసీలు చిరువైపు మళ్లకుండా, నాడు కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కాపు ముద్ర వేశాయి. కేవలం కాపు ఓట్ల కోసమే, రాజకీయాల్లోకి వచ్చాడంటూ లోలోపల జనంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికారం కోసం ఏడాదంతా ఊరూరా తిరిగిన చిరుకు, ఆ వర్గం ఓట్లే అత్యధికంగా పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడే కాపు ఓట్లు అధికం.

ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం రాకపోవడంతో, పార్టీని నడపలేక ప్రజారాజ్యం జెండా పీకేశారు చిరంజీవి. దీంతో కాపు వర్గానికి, అధికారం అందనిద్రాక్షేనని మరోసారి రుజువైంది. అయితే ఇప్పుడు అన్నను మించిన తమ్ముడిగా పవన్‌ మరోసారి అధికార ఉట్టిని అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీంతో నాడు ప్రజారాజ్యంపై ఎలాంటి కులం ముద్ర వ్యూహం వేశారో, ఇప్పుడు జనసేనపైనా అలాంటి క్యాస్ట్‌ ట్రేడ్ మార్క్ వేసేందుకు స్ట్రాటజీలు పదునెక్కాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. నిజమేనా?

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు పవన్ కల్యాణ్. అప్పటికే జనసేనను స్థాపించినా, ఓట్ల చీలిక వద్దన్న ఆలోచనతో మోడీ, బాబులకు మద్దతిచ్చేందుకే పరిమితమయ్యారు కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం పనవ్ రాకతోనే, కాపు ఓట‌్లన్నీ తెలుగుదేశానికి పడ్డాయన్నది ఒక విశ్లేషణ. టీడీపీని వెంట్రుకవాసిలో గెలుపు వైపు నిలబెట్టిన రెండు శాతం ఓట్లు, పవన్‌ వల్లే వచ్చాయన్నది జనసేన వాదన. ఇప్పుడు అవే ఓట్లు చీలిపోతాయి, లేదంటే తమకు పడవన్న భయంతోనే పవన్‌పై కులం ముద్ర వెయ్యాలన్నది టీడీపీ వ్యూహంగా కొందరు చెబుతున్నారు.

రాష్ట్ర విభజనతో ఏపీలో అతిపెద్ద కులంగా నిలిచారు కాపులు. మొత్తం 17 శాతం కాపులున్నారని, ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే ఉంది. అంతకంటే ఎక్కువే ఉండొచ్చని కాపు సంఘాలు చెబుతున్నాయి. అంటే అత్యధిక స్థానాల్లో నిర్ణయాత్మక శక్తి కాపులేనన్నది ఒక అంచనా. మరోవైపు కాపుల తర్వాత ఏపీలో అత్యధికులు ఎస్సీలు. దాదాపు 15 శాతం వీరే. ఇందులో 11.5 శాతం మాలలుగా నిర్ధారణ. 2014లో టీడీపీ వెంట కాపులు నిలిస్తే, వైసీపీకి ఎస్సీలు సపోర్ట్‌నిచ్చారు. ఇప్పుడు పవన్ రాకతో తన వెంట నిలిచిన కాపులు ఎక్కడ దూరమౌతారోనని ఆందోళనపడుతోంది టీడీపీ. అందుకే కులం ముద్ర వేస్తోందన్నది విశ్లేషణ. అంతేకాదు పవన్ అభిమానుల్లో ఎస్సీలు, బీసీలు కూడా ఉన్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక. దీంతో జనసేనపై కాపుముద్ర వేసి, ఎస్సీలు, బీసీలను దూరం చేయాలన్నది కూడా తెలుగుదేశం వ్యూహంగా కొందరు అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశం వ్యూహాన్ని అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్, తనను ఒకేవర్గానికే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళనపడుతున్నారు. అందుకే తాను అన్నివర్గాలకు చెందినవాడనని, తనకు కులపిచ్చిలేదని, అందరూ తనకు సమానమేనని, ఇండియన్‌నని ప్రతి సభలోనూ పదునైన బాణాలు విసురుతున్నారు. తనపై కులం ముద్ర వేస్తే, కాళ్లు విరగ్గొడతానంటూ ఎదురుదాడికి దిగారు పవన్ కల్యాణ్.

ప్రస్తుతం జనసేన పార్టీ మొత్తం, కాపు వర్గంతో నిండిపోయిందన్నది తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న మరో విమర్శ. మీడియా సలహాదారు నుంచి అధికార ప్రతినిధుల వరకు, కాపువర్గానికి చెందినవారినే, పవన్‌ నియమించుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వ మాజీ సలహాదారు ఐవైఆర్ కృష్ణా రావు మాత్రం, జనసేనలో ఎలాంటి కులం ముద్రలేదంటున్నారు. పార్టీ నిర్మాణంలో సామాజికవర్గం ప్రాధాన్యత కనిపించడం లేదంటున్నారు. గురువింద తన నలుపెరగదు అన్నట్టుగా, కొందరు వ్యవహరిస్తున్నారంటూ, టీడీపీ నేతలపై పరోక్షంగా కామెంట్లు చేశారు.

ఎన్నికల హామీలు, మొదటి ఐదు సంతకాలు వాగ్ధానాలు ఏమయ్యాయని ఇప్పటికే కాంగ్రెస్, వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నాయి. కాపు రిజర్వేషన్లపై ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఛైర్మన్ నివేదిక స్వీకరించకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కాపులకే కాదు రజకులను బిసిలనుంచి ఎస్సీలుగా బోయలను, మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామన్న హామి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇలా రాజధాని నిర్మాణం నుంచి అనేక హామీల వరకు, ప్రభుత్వ వ్యతిరేకత ఏదో ఒక స్థాయిలో ఉందని భావిస్తున్న టీడీపీ, గత ఎన్నికల్లో తనను గట్టెక్కించిన కాపు ఓట్లు మొత్తం పవన్‌కే గంపగుత్తగా పడకుండా, కులం ముద్ర వేసే వ్యూహానికి పదునుపెట్టిందన్నది విశ్లేషణ. మరి అన్నపై సక్సెస్‌ అయిన కాపు ముద్ర, తమ్ముడిపైనా సక్సెస్‌ అవుతుందా...ఈ వ్యూహాలన్నీ తిప్పికొట్టి, పవన్ అందరివాడిలా అవతరిస్తాడా...అన్నలా కొందరివాడుగానే మిగిలిపోతాడా?

లైవ్ టీవి

Share it
Top