ఇప్పటివరకు లంచం తీసుకుంటేనే నేరం...ఇకపై...

Submitted by arun on Thu, 07/26/2018 - 11:12

ఇప్పటివరకు లంచం తీసుకుంటేనే నేరం ఇకపై లంచం ఇచ్చినా నేరమే. పార్లమెంట్‌లో అవినీతి నిరోధక చట్టసవరణ బిల్లు ఆమోదం పొందడంతో లంచం ఇవ్వజూపడం కూడా ఇప్పుడు చట్టప్రకారం నేరమే అవుతుంది. నిజాయితీగా పనిచేసే అధికారులకు, సంస్థలకు లంచం ఇవ్వజూపినట్లు నిరూపితమైతే జైల్లో ఊచలు లెక్కించాల్సిందే.

దేశంలో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా లొసుగుల ఆధారంగా తప్పించుకోవడం చాలామందికి సాధారణమైపోయింది. దీంతో ఇకపై ఆ అవకాశం లేకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పెచ్చరిల్లుతున్న అవినీతికి మూలకారణం లంచం. ప్రభుత్వ కార్యాలయాలైనా ప్రైవేట్ ఆఫీసులైనా ఎక్కడ ఏ పని జరగాలన్నా లంచం లేనిదే ఫైలు ముందుకు కదలదు. లంచం తీసుకోవడం అధికారులకు ఎలా అలవాటైందో లంచం ఇవ్వడం కూడా జనాలకు జీవితంలో భాగమైపోయింది. పని తొందరగా పూర్తవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్నారు ప్రజలంతా. అందుకే లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అంటోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. లంచం ఇచ్చే వారికి కూడా శిక్ష పడేలా మార్పులు చేశారు.

కొత్తగా అమల్లోకి రానున్న అవినీతి నిరోధక చట్టం ద్వారా లంచం తీసుకున్నా ఇచ్చినా కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సవరణతో ప్రభుత్వ బాధ్యత, పారదర్శకత కూడా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే చట్టం సరైందే అయినా ప్రభుత్వ అధికారులు బాధ్యతగా, నిజాయితీతో పనిచేస్తే తొందరలోనే మంచి జరుగుతుందని సామాన్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే అరెస్ట్ చేయకుండా చట్టంలో నిబంధనలు  పొందుపర్చారు. దీని ప్రకారం విచారణ వేగవంతం చేయడం, విశ్రాంత అధికారుల్లో నిజాయితీపరులు ఉంటే వారికి శిక్ష పడకుండా చూడటం వంటి అంశాలను కూడా పొందుపర్చారు.

English Title
Parliament Passes Prevention of Corruption Bill

MORE FROM AUTHOR

RELATED ARTICLES