పైసా వ‌సూల్ రివ్యూ

పైసా వ‌సూల్ రివ్యూ
x
Highlights

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 100 సినిమాలు పూర్తి చేసి శతచిత్ర నటుడయ్యాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' నటుడిగా బాలకృష్ణకు మంచి...

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 100 సినిమాలు పూర్తి చేసి శతచిత్ర నటుడయ్యాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' నటుడిగా బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత 101వ చిత్రంగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పైసావ‌సూల్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. పూరి జగన్నాథ్‌ సినిమాలు చెయ్యాలంటే హీరోలందరూ ఎంతో ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. ఎందుకంటే అతని సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేషన్‌ కొత్తగా వుంటుంది, కొత్త డైలాగ్స్‌ రాస్తాడు. అలా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదౖలెన పైసా వసూల్‌'లో నందమూరి బాలకృష్ణను కొత్తగా చూపించడంలో పూరి జగన్నాథ్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? బాలకృష్ణ కోసం పూరి ఎంచుకున్న కథాంశం ఏమిటి? ఈ సినిమా బాలకృష్ణకు ఎలాంటి పేరు తెస్తుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

పైసా వసూల్‌ కోసం పూరి జగన్నాథ్‌ ఎంచుకున్న కథ చాలా పాతది. మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన కథ. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తన నెట్‌వర్క్‌తో నేర సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్న బాబ్‌ మార్లే(విక్రమ్‌జీత్‌)ని పట్టుకోవడం 'రా' ఆఫీసర్ల వల్ల కావడం లేదు. ఆ ప్రయత్నాలు చేసిన ఆఫీసర్లు హత్యకు గురవుతున్నారు తప్ప ఫలితం శూన్యం. ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌తో ప్రపంచాన్ని ఏలుతున్న బాబ్‌ మార్లేని ఇల్లీగల్‌గానే హతమార్చాలని నిర్ణయించుకుంటుంది 'రా' బృందం. అందుకోసం ఒక నేరస్తుడినే అపాయింట్‌ చెయ్యాలనుకుంటారు. ఆ పని చేసే వాడు ఎవడు అని ఎదురుచూస్తున్న స‌మ‌యంలో వారికి తేడాసింగ్‌(బాల‌కృష్ణ‌) కనిపిస్తాడు. అతనికి ఆపరేషన్‌ అప్పగిస్తారు. ఓ పక్క హీరోయిన్‌ హారిక(ముస్కాన్‌) సోదరి సారిక(శ్రీయా) కొన్ని నెలలుగా కనిపించకుండా పోతుంది. అక్క కోసం హారిక ఎక్స్‌టర్నల్‌ ఎౖఫెర్స్‌ ఆఫీసర్‌ని ఆశ్రయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాబ్‌ మార్లే మనుషులు ఆమైపె దాడి చేస్తారు. సారిక ఎక్కడుందని ప్రశ్నిస్తారు. వారి బారినుంచి హారికను తేడాసింగ్‌ రక్షిస్తాడు. అంతకుముందు నుంచే లవ్‌ లవ్‌ అంటూ హారిక వెంట పడతాడు తేడా సింగ్‌. బాబ్‌మార్లే మనుషులు హారిక‌పై ఎందుకు దాడి చేశారు? సారిక ఏమైంది? అసలు తేడా సింగ్‌ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? 'రా' చేపట్టిన ఆపరేషన్‌ని తేడాసింగ్‌ కంప్లీట్‌ చేశాడా? అనేది మిగతా కథ.

తేడా సింగ్‌ క్యారెక్టర్‌ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది, అంతే వల్గర్‌గా కూడా వుంటుంది. ఆ క్యారెక్టర్‌ని బాలకృష్ణ తనకి వున్న పరిధిలో బాగానే చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్‌కి థియేటర్‌లో చప్పట్లు, విజిల్స్‌ మారు మోగాయి. పంచ్ డైలాగ్స్‌ అయినా, పవర్‌ఫుల్ డైలాగ్స్ అయినా వాటికీ ఒక లిమిట్‌ వుంటుంది. అప్పుడప్పుడు చెప్తేనే అవి పంచ్ డైలాగ్స్‌ అంటారు. సినిమా అంతా అవే వుంటే ఏమంటారు? ఈ సినిమా చూసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. అయితే బాలకృష్ణ కోసం కొత్తగా క్రియేట్‌ చేసిన ఈ క్యారెక్టర్‌గానీ, అతను చెప్పే డైలాగ్స్‌గానీ కేవలం ఫ్యాన్స్‌ కోసమే అనేది అర్థమవుతుంది. బాలకృష్ణ సినిమాల్లోని డైలాగ్స్‌ ఎంతో ఎమోషన్‌తో కూడుకొని అర్థవంతంగా వుండేవి. కానీ, ఈ సినిమాలో డైలాగ్స్‌కి అర్థం పర్థం ఉండదు. నోటికి వ‌చ్చిన డైలాగ్స్‌ని చెప్పుకుంటూ పోతున్నాడనిపిస్తుంది. ఏ డైలాగ్ అయినా అభిమానుల్ని అలరించడానికే కాబట్టి మ‌నం సర్దుకుపోవాలి. ఇందులో బాలకృష్ణ చెప్పినట్టు ఈ సినిమాకి 'ఓన్లీ ఫ్యాన్స్‌ అండ్‌ ఫామిలీస్‌... ఔటర్స్‌ నాట్‌ ఎలౌడ్‌'. డాన్సుల్లో, ఫైట్స్‌లో బాలకృష్ణ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ వయసులో అలాంటి డాన్సులు, ఫైట్స్‌ చెయ్యడం అనేది బాలకృష్ణకే సాధ్య‌మైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీయా ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా తన పాత్రకు న్యాయం చేసింది. ముస్కాన్‌ కేవలం పాటలకే పరిమితౖమెంది.

సాంకేతిక విభాగాలకు గురించి చెప్పుకోవాలంటే ముఖేష్‌ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. ఇండియాలో తీసిన సీన్స్‌గానీ, పోర్చుగల్‌లోని అంద‌మైన‌ లొకేషన్స్‌లో తీసిన సీన్స్‌ గానీ, పాటలుగానీ విజువల్‌గా చాలా గ్రాండ్‌గా వున్నాయి. ముఖ్యంగా పోర్చుగల్‌లో తీసిన కార్‌ ఛేజ్ సీన్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే సినిమాలోని మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. సినిమా రిలీజ్‌కి ముందే పాటలు ఆడియన్స్‌లోకి వెళ్ళాయి. బాలకృష్ణ పాడిన 'మామా ఎక్‌ పెగ్‌ లా' పాట కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయానికి వస్తే సినిమా అదే పెద్ద మైనస్‌ అయింది. బల‌మైన కథ, కథనాలు లేకపోవడం, సీన్స్‌ కూడా చాలా నార్మల్‌గా వుండడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎఫెక్టివ్‌ చేసే అవసరం కలగలేదు. నిర్మాత ఆనంద్‌ప్రసాద్‌ సినిమాని రిచ్‌గా నిర్మించడంలో ఎక్కడా వెనకాడలేదనేది అర్థమవుతుంది. డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్‌ గురించి చెప్పాల్సి వస్తే పోకిరితో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన పూరి జగన్నాథ్‌ ఇంకా ఆ మత్తులోనే వున్నట్టు కనిపిస్తున్నాడు. అదే ఫార్మాట్‌లో పైసా వసూల్‌ చిత్రాన్ని కూడా తీశాడు. ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలా చూశాం కాబట్టి నెక్ట్స్ సీన్‌లో ఏం జరగబోతుందనేది అందరికీ తెలిసిపోతుంది. పాత కథకి కొన్ని కొత్త డైలాగులు రాసుకున్నాడు తప్ప కథ విషయంలో ఎలాంటి రిస్క్‌ చేయలేదు. అసలు డైలాగులు రాసిన తర్వాతే కథ రాశాడేమోనన్న డౌట్‌ కూడా వస్తుంది. ఆ డైలాగులు బాలకృష్ణకు కూడా బాగా నచ్చి వుంటాయి. అందుకే పూరితో సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేశాడు.

ఈ సినిమా చేసింది పాత కథతోనే అయినా దాన్ని కూడా పర్‌ఫెక్ట్‌గా చెయ్యడంలో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. ఈ కథలో ఎన్నో లాజిక్స్‌ మిస్‌ చేశాడు పూరి. బాబ్‌ మార్లేని అంతమొందిం చడానికి తేడాసింగ్‌ని నియమిస్తుంది 'రా'. కానీ, తేడా సింగ్‌ మాత్రం అసలు పని వదిలేసి హీరోయిన్‌ వెంట పడుతుంటాడు. 'రా' అప్పగించిన ఆపరేషన్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడు. ఇవన్నీ పక్కన పెట్టి బాలకృష్ణతో ఎలాంటి డైలాగులు చెప్పించాలి. దాని కోసం ఎలాంటి సీన్‌ క్రియేట్‌ చెయ్యాలనే ఆలోచనతో సీన్స్‌ రాసుకున్నట్టు వుంటుంది తప్ప స‌రైన‌ కంటెంట్‌ కోసం చేసిన ప్రయత్నం కనిపించదు. సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఎండ్‌ అయ్యే వరకు స్క్రీన్‌మీద ఎక్కువ కనిపించేది బాలకృష్ణే. సినిమాకి ప్లస్‌ అయింది బాలకృష్ణ, అతను చెప్పిన డైలాగ్సే. ఇక మిగతావన్నీ మైనస్‌లనే చెప్పాలి. చివరగా ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలకృష్ణ ఇంతకుముందు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని ఎంజాయ్‌ చేసిన అభిమానులు ఈ సినిమాలో చెప్పిన కొత్త డైలాగ్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. బాలకృష్ణ డైలాగ్స్‌ని ఇష్టపడే అభిమానులకు మాత్రమే ఇది పైసా వసూల్‌ సినిమా అవుతుంది.

చివరగా: డైలాగ్స్‌తోనే పైసా వ‌సూల్

రేటింగ్
2/5

Show Full Article
Print Article
Next Story
More Stories