ఫోన్‌ పక్కనుంటే మైండ్‌ పనిచేయదని తేల్చిన సర్వే

Submitted by lakshman on Fri, 09/22/2017 - 19:44

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్‌ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా పర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్‌ ఫోన్‌ కొంపలు ముంచుతోంది. స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా వాడటం ద్వారా అనేక రకాల వాద్యులు, జబ్బులు సంభవించే అవకాశం ఉంది. దీనికి తోడు  స్మార్ట్‌ఫోన్‌ మనకు కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్‌ఫోన్‌ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్‌ఫోన్‌ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌ అదేపనిగా వాడటం ద్వారా వచ్చే మార్పుల గురించి తెలియజేయడానికి ఆయన ఓ పరిశోధన చేశారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్‌ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవౖరెనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ! 

అభ్యర్థుల స్మార్ట్‌ఫోన్‌ పక్కగదిలో ఉండటమో, టేబుల్‌ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితౖమెన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్‌ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్‌ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్‌ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.

ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ఫోన్‌తో తమ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు అబ్బే మేము ఫోన్‌ లేకుండా నిమిషం కూడా బతకలేము అని చెప్పారు. మరికొందరు ఫోన్‌ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్న ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవౖరెతే ఫోన్‌ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్‌లో కనిపించిన చిన్నపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఫోన్‌ వాడటం ద్వారా చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఫోన్‌ ఇంటర్నెట్‌‌పై ఆధారపడడంతో సమాధానాలు చేయలేకపోయారు. ఫోన్‌తో చాలా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. 

ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్‌ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్‌ వస్తుందేమో, వాట్సప్‌ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్‌ ఉందో లేదో, భార్యకి కాల్‌ చేయాలి కదా, ఆన్‌లై‌న్‌లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టిం చుకోకుండా పనిచేసు కోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్‌ఫోన్‌ జీవితాలను కమ్ముకుని ఉంటోంది.

English Title
overuse of smartphones

MORE FROM AUTHOR

RELATED ARTICLES