logo

దేశవ్యాప్తంగా భారత్ బంద్...పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా విపక్షాల ఆందోళన..

దేశవ్యాప్తంగా భారత్ బంద్...పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా విపక్షాల ఆందోళన..

పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇవాళ భారత్‌ బంద్‌ జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్‌కు టీడీపీ, ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. భారత్‌ బంద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ సహా వామపక్షాలు భారత్‌ బంద్‌కు పాటిస్తున్నాయి. బంద్‌కు తెలుగుదేశం, కర్ణాటకలోని జనతా దళ్ సెక్యులర్, డీఎంకే , రాష్ట్రీయ జనతాదళ్ , ఎన్‌సీపీ , సమాజ్‌వాదీ పార్టీలు మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు రాజ్‌ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా మద్దతు తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్‌ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్‌ థాకరే ప్రకటించారు.

బంద్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకూ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగానే బంద్ వేళలు ప్రకటించామని అన్నారు. విపక్ష పార్టీల బంద్‌తో ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. పెట్రో ధరలు తగ్గించాలంటూ జరుగుతున్నదేశవ్యాప్త బంద్ కు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

మరోవైపు చమురు ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలే కారణమంటూ చేతులు దులుపుకుంటోంది. నిన్న కూడా పెట్రోల్‌ ధర లీటరుకు 12పైసలు, డీజిల్‌ ధర లీటరకు 10 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 80 రూపాయల 50 పైసలు.. డీజిల్‌ 72రూపాయల 10 పైసలకి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ 85.35, డీజిల్‌ 78.98, విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 86 రూపాయల 48 పైసలకు చేరగా..డీజిల్‌ ధర 79 రూపాయల 78 పైసలు పెరిగింది. పెట్రో ఉత్పత్తుల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపైనే కాదు... ప్రజల నిత్యావసరాల ధరలపైనా పడుతోంది.

అయితే ప్రతిపక్షాల బంద్‌కు తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలకు తాము మద్దతిస్తున్నామని, అయితే భారత్ బంద్ సందర్భంగా సాధారణ జన జీవనం స్తంభించిపోవడం సరికాదని అంటోంది. అందుకే కేవలం నిరసన ప్రదర్శనలకు పరిమాతమవుతామని ప్రటించింది. బెంగాల్ లో రవాణా వ్యవస్థ యథాతథంగా పని చేసేందుకు మమత బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే వినాయక చవితికి ఆటంకం కలుగకుండా చూడాలన్న కారణంగా గోవా కాంగ్రెస్ యూనిట్ సైతం బంద్‌లో పాల్గొనడంలేదు. కేరళ వరద బీభత్సం దృష్ట్యా ముస్లిం లీగ్ పార్టీ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించిది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top