ర‌జినీ స‌త్తా ఏంటో తేల్చిన స‌ర్వే

ర‌జినీ స‌త్తా ఏంటో తేల్చిన స‌ర్వే
x
Highlights

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై అప్పుడే సర్వేలు మొదలైపోయాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై అప్పుడే సర్వేలు మొదలైపోయాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రంలో బలంగా ఉండటంతో రజనీ ప్రభావం ఎంతుంటుందనే దానిపై చర్చ మొదలైంది. రజనీ రాకతో ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనే లెక్కలేస్తున్నారు. ఇటు అధికార అన్నాడీఎంకేలోనూ అటు ప్రతిపక్ష డీఎంకేలో కూడా అంతర్మథనం మొదలైంది. రజనీ రాకతో ఎవరి ఓటు బ్యాంకు ఎంత లాక్కుంటారనే దానిపై లెక్కలేసుకుంటున్నారు.

తమిళనాడులో మూడు దశబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోటీ ఉంటోంది. కానీ రజనీ రాకతో త్రిముఖ పోటీ జరగనుంది. అయితే ఓ జాతీయ ఛానెల్‌ నిర్వహించిన సర్వేలో షాకింగ్‌ సంగతులు బయటపడ్డాయి. ఇప్పటికిప్పుడు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే రజనీ పెద్దగా ప్రభావం చూపలేరని సర్వేలో తేలింది. అంతేకాదు రజనీకాంత్‌ ముఖ్యమంత్రి కావడం కష్టమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే డీఎంకేనే అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పింది. డీఎంకేకు 130 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.

తమిళనాడు తర్వాతి ముఖ్యమంత్రి ఎవరంటూ జరిపిన సర్వేలో డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ వైపే తమిళ ప్రజలు మొగ్గుచూపారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో స్టాలిన్‌కు 50శాతం ఓట్లు వచ్చాయి. ఇక రాజకీయాల్లో వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌ వైపు కేవలం 16శాతం మాత్రమే మొగ్గుచూపారు. ఇక ప్రస్తుత సీఎం పళనిస్వామికి పన్నీర్‌ కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చాయి. పన్నీర్‌ వైపు 11శాతం ప్రజలు మొగ్గుచూపితే పళనికి కనీసం 5శాతం రాలేదు. ఇక దినకరన్‌ పరిస్థితి పళనిలాగే ఉన్నట్లు సర్వేలో తేలింది.

రజనీ రాక వల్ల అన్నాడీఎంకేకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఈ సర్వే చెబుతోంది. అన్నాడీఎంకే నుంచి 20శాతం, డీఎంకే నుంచి 16 శాతం ఓటర్లు రజనీ వైపు మళ్లొచ్చని తేలింది. అయితే రజనీ ముఖ్యమంత్రి కావాలని 16శాతం మంది మాత్రమే ఆకాంక్షించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రజనీకాంత్ పార్టీ 33 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అయితే అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్తేనే రజనీకి మంచిదని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories