తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ

Submitted by arun on Tue, 03/20/2018 - 10:04
SSC paper leak

మొన్న ఏపీ.. నిన్న తెలంగాణ.. తెలుగు రాష్ట్రాల్లో.. టెన్త్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే.. ఇంగ్లీష్ పేపర్ వాట్సాప్‌లో బయటకు వచ్చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు టీచర్లపై కేసు నమోదైంది.

ఆదిలాబాద్ జిల్లా తాడిహత్నూర్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకైంది. ఉదయం తొమ్మిదిన్నరకు పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. ఇన్విజిలేటర్లు వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్‌ను బయటి వ్యక్తులకు పంపించారు. వాళ్లు అందులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపించారు. వీటి ఆధారంగా 262 మంది స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసినట్లు తెలుస్తోంది. 

పేపర్ లీకేజీలో.. ఇన్విజిలేటర్లు చాలా తెలివిగా వ్యహరించారు. తమ సెల్‌ఫోన్ల నుంచి కాకుండా వేరే వ్యక్తుల మొబైల్ ఫోన్ల నుంచి క్వశ్చన్ పేపర్ ఫోటోలు తీసి బయటకు పంపించారు. పేపర్ లీకే చేసే తొందరలో.. క్వశ్చన్ పేపర్ కింద ఉన్న స్టూడెంట్ హాల్ టికెట్‌ను మర్చిపోయారు. దీని ఆధారంగానే.. ఉన్నతాధికారులు పేపర్ లీకైనట్లు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లి ఆరా తీసిన డీఈవో జనార్దన్ రావు.. ఇందుకు బాధ్యులైన నలుగురు ఇన్విజిలేటర్లను గుర్తించారు. వారిపై నార్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇక.. పోలీసులు కూడా పేపర్ లీకేజీకి ప్రధాన కారకులెవరు వాట్సాప్‌లో పంపిన ఫోన్ ఎవరిది క్వశ్చన్ పేపర్ ఎవరెవరికి పంపారు ఏయే ప్రాంతాలకు చేరవేశారు  ఒక్క ఇంగ్లీష్ పేపరే లీకైందా ఇంతకుముందు ప్రశ్నపత్రాలు కూడా లీక్ చేశారా ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పేపర్ లీకేజీతో ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేగింది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.   

English Title
Officials suspended for leaking SSC question paper in Adilabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES