ఏపీకి షాకిచ్చిన గడ్కరి

Submitted by arun on Thu, 07/12/2018 - 10:36
Polavaram

పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌పై కేంద్రమంత్రి గడ్కరి రాష్ట్రప్రభుత్వానికి షాకిచ్చారు. అసలు ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో డీపీఆర్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సరైన పత్రాలను సమర్పిస్తేనే నిధుల విషయంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందన్న ఆయన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. స్పిల్ వే పనులతో పాటు కుడి కాలువ పనులను కూడా పరిశీలించారు. తర్వాత అధికారులతో ఇరువురూ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఆర్ మార్పుపై గడ్కరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. అలాగే ప్రాజెక్టు వ్యయంపై కూడా ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న విధివిధానాలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కోసం మార్చలేమని స్పష్టం చేశారు. 

డీపీఆర్ మార్పుపై సరైన పత్రాలతో ఢిల్లీకి రావాలని సంబంధిత అధికారులను గడ్కరి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదన్న ఆయన ఆర్థికశాఖ అనుమతి కావాలంటే సరైన కారణం ఉండాలని స్పష్టం చేశారు. అయితే డీపీఆర్‌ మార్పుపై స్పాట్‌లోనే వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం 57 వేల 940 కోట్లు ఖర్చవుతుందని అందులో భూసేకరణకే 33 వేల కోట్లవుతుందని లెక్కలతో సహా వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని గడ్కరి స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకుందామన్న ఆయన వచ్చే ఫిబ్రవరి నాటికి సివిల్స్ వర్క్స్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టలేమని గడ్కరి స్పష్టం చేశారు. 

English Title
No dearth of funds, says Minister Nitin Gadkari

MORE FROM AUTHOR

RELATED ARTICLES