logo

అవిశ్వాసం ఓటింగ్ తర్వాత జేసీ...టీడీపీకే గుడ్‌ బై చెబుతారా..?

అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరంగా ఉంటానని కలకలం రేపి జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు అలక వీడారు. చంద్రబాబు ఫోన్ చేసిన తర్వాత మెత్తబడిన జేసీ నేడు లోక్‌సభకు హాజరౌతానని ప్రకటించారు. అనంతపురం గ్రూపు రాజకీయాల వల్లే జేసీ టీడీపీ హైకమాండ్‌కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అవి‌‌శ్వాసం ఓటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడండంటూ జేసీ సస్పెన్స్ మిగిల్చారు.

టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హాజరుకావడం లేదని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ సొంత ఎంపీ మద్దతు కూడగట్టుకోలేకపోయిందన్న అపవాదు నేపథ్యంలో జేసీ ఎపిసోడ్‌ను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. జేసీ అలక అంశంపై ఆరా తీశారు.

అవిశ్వాసానికి గైర్హాజరవుతానని జేసీ ప్రకటించడం వెనుక అనంతపురం రాజకీయాలే కారణమని తేలింది. అనంతపురంలో రోడ్డు విస్తరణ సందర్భంగా ప్రార్థనా మందిరాలను తొలగించాలని జేసీ పట్టుబట్టడం ఆలయాలను తొలగించవద్దని ఆయా సామాజికవర్గాలు కోరడం ప్రార్థనామందిరాల కమిటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం విభేదాలకు దారి తీసిందని సమాచారం. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరే ప్రార్థనామందిరాల కమిటీలను కోర్టుకు పంపించారని ఆరోపిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి అలకపూనారు. అంతేకాదు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సన్నిహితులకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. జేసీతో మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలని చెప్పారు.

అంతేకాదు..జేసీ కోరుతున్నట్లు అనంతపురంలో రహదారుల విస్తరణ పనులకు 45.53 కోట్ల సవరించిన అంచనాలతో ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చింది. దీంతో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలక వీడినట్టు సమాచారం. దీంతో ఆయన వెంటనే ఢిల్లీకి బయల్దేరారు. మొత్తానికి సీఎం జోక్యంతో జేసీ , ప్రభాకర్‌ చౌదరి మధ్య నెలకొన్న పంచాయతీ సద్దుమణిగింది. అయితే అవిశ్వాసంపై ఓటింగ్ లో పాల్గొన్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా అంశం గురించి చెబుతాననని ప్రకటించి జేసీ మరో సంచలనానికి తెరలేపారు. మరి జేసీ ఏంపీ పదవికి రాజీనామా చేస్తారా..? లేదంటే టీడీపీకి గుడ్‌బై చెబుతారా..అదీకాందంటే..ఇటీవల రాజకీయాలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్న జేసీ అసలు పాలిటిక్స్ నుంచే వైదొలుగుతారా..?అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు విభజన హామీల గురించి లోక్‌ సభలో చర్చ జరుగుతుంటే హాజరుకాబోనని జేసీ ప్రకటించడంపై పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఐ కార్యకర్తలు, నేతలు అనంతపురంలో దివాకర్‌ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top