నేడు ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుతం

నేడు ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుతం
x
Highlights

అంతరిక్ష అద్భుతాలను తిలకించాలని ఉవ్విళ్లూరే ఔత్సాహికులకు ఇవాళ పెద్ద పండుగ వచ్చింది. ఈ సాయంత్రం ఒకటి కాదు.. రెండు.. ఏకంగా మూడు అద్భుతాలు ఆవిష్కృతం...

అంతరిక్ష అద్భుతాలను తిలకించాలని ఉవ్విళ్లూరే ఔత్సాహికులకు ఇవాళ పెద్ద పండుగ వచ్చింది. ఈ సాయంత్రం ఒకటి కాదు.. రెండు.. ఏకంగా మూడు అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి. ఒకే రాత్రి అరుదైన సూపర్ మూన్, బ్లూ మూన్, చంద్ర గ్రహణం సంభవించనున్నాయి. కనువిందు చేసే ఈ ఖగోళ దృశ్యం 36 ఏళ్ల తర్వాత చోటు చేసుకుంటోంది.

ఈ ఏడాది ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో మొదటి గ్రహణం ఈ సాయంత్రం సంభవించనుంది. ప్రతి ఏటా గ్రహణాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ నేటి చంద్ర గ్రహణం ఎంతో ప్రత్యేకం. ఇది ఎంతో అరుదైనది. అత్యంత అపురూపమైనది. ఎన్నో ఏళ్లకోసారి వచ్చేది.

సాధారణంగా చందమామ తెల్లగా, చాలా చల్లగా ఉంటాడు. ఆ చల్లటి చంద్రుడు రుధిర వర్ణం పులుముకోబోతున్నాడు. క్రోధంతో ఎర్రగా, మండే చంద్రుడిగా నెత్తుటి రంగులో కనిపించబోతున్నాడు. అరుదైన బ్లడ్ మూన్ అని పిలిచే ఖగోళ పరిణామానికి ఈ సాయంత్రం సాక్షీభూతం కానుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చందమామ అరుణవర్ణంలో వెలుగులు వెదజల్లుతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో బ్లడ్‌మూన్‌ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ మొత్తం జాబిల్లిపై పడుతూ ఉంటుంది. అదే సమయంలో భూమి వెనుక వైపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత చంద్రుడిపై పడుతుంది. ఈ క్రమంలో అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కువ తరంగ దైర్ఘ్యమున్న ఎరుపు కాంతి జాబిల్లిని చేరుతుంది.

నిండు జాబిల్లి... నీలాల జాబిలి ఎందుకైందంటే.. కొన్ని ప్రాంతాల్లోని అరుదైన ధూళి కణాల కారణంగా పున్నమి నాటి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. దీంతో అక్కడి వారు బ్లూమూన్‌ అని పేరు పెట్టుకున్నారు. ఇదే ప్రపంచం మొత్తం వాడుకలోకి వచ్చింది. ఒకే నెలలో వచ్చే రెండో పున్నమిని బ్లూమూన్‌ అంటారు. ఇవాళ కనిపించే జాబిలి ఇదే.

ఇక భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కొన్నిసార్లు చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వస్తాడు. ఇలాంటి సమయాల్లో అంటే పౌర్ణమి రోజున సూర్యుడికి చంద్రుడు అభిముఖంగా వస్తాడు. దీంతో జాబిల్లి పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. ఏదైనా పున్నమి రోజున భూమికి అతి దగ్గరగా వస్తే దాన్ని ‘సూపర్‌ మూన్‌’ అంటారు.

1982, డిసెంబర్ 30న బ్లూ మూన్, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఆనాడు యావత్ భారతదేశమంతా ఆ వింతను చూసి ఆనందపడింది. ఇప్పుడు ఆ అద్భుతానికి బ్లడ్ మూన్ కూడా కలిసి వస్తుండటంతో ఈ అపురూప దృశ్యాన్ని మిస్ కావద్దని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories