గెలుపే లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం...ఇన్‌ఛార్జులను మార్చేందుకు అధిష్టానం లిస్ట్‌ రెడీ

Submitted by arun on Sat, 09/22/2018 - 09:53

నాలుగేళ్లు పార్టీ కోసం పనిచేశారు. కేడర్‌‌ను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని తీర్చిదిద్దారు. తీరా ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి టికెట్‌ రేసులో వెనుకబడిపోయారు. సర్వేల పేరుతో నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చేస్తుండటంతో వైసీపీలో పలువురు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు వైసీపీలో మంటలు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చే పని మొదలుపెట్టారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గాల్లో పనిచేసిన నేతలను పక్కనబెట్టి కొత్త వాళ్లకు బాధ్యతలు అప్పగించడంపై మండిపడుతున్నారు. ఇన్‌ఛార్జుల మార్పుతో ఎక్కడికక్కడ అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో చేపట్టిన నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు పార్టీలో కలకలం రేపింది. విజయవాడ సెంట్రల్‌ బాధ్యతల్ని మల్లాది విష్ణుకి అప్పగించడంతో వంగవీటి రాధా అనుచరులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అలాగే విజయవాడ ఈస్ట్‌ అండ్ వెస్ట్‌ ఇన్‌ఛార్జులను కూడా మార్చాలని పార్టీ నిర్ణయించడంతో ఇప్పటివరకూ అక్కడ పనిచేసిన నేతలు ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చి కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగించారు.  ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటివరకూ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మర్రి రాజశేఖర్‌ను తప్పించి ఇటీవల పార్టీలో చేరిన రజినీకి బాధ్యతలు అప్పగించారు. దాంతో నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన మర్రి రాజశేఖర్‌ పార్టీ నిర్ణయం రగిలిపోతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముత్యాల శ్రీనుని తప్పించి జ్యోతుల చంటిబాబుని నియమించారు. ఆనం ఎంట్రీతో నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సీనే రిపీట్‌ కాబోతోంది. వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తప్పించేందుకు రంగంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చేందుకు అధిష్టానం లిస్ట్‌ రెడీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ మార్పులన్నీ పార్టీ గెలుపు కోసమే అంటోంది అధిష్టానం. కానీ ఇన్నేళ్లూ పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, చివరి నిమిషంలో నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడం అన్యాయమంటున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలు వైసీపీకి చావోరేవో కావడంతో విజయావకాశాలతోపాటు ఆర్ధిక అంగ బలం ఉన్నవాళ్లకే టికెట్లు ఇవ్వనున్నట్లు సంకేతాలు పంపుతున్నారు.

English Title
New YSRCP Incharge List

MORE FROM AUTHOR

RELATED ARTICLES