మహాకూటమిలో మరో ట్విస్ట్

Submitted by arun on Mon, 11/19/2018 - 10:07

పొత్తు పొత్తే.. పోటీ పోటీయే అన్నట్లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పార్టీలు.. బరిలో మాత్రం కత్తులు దూసుకుంటున్నాయి. ఏకైక లక్ష్యంతో బరిలో నిల్చిన కూటమి పార్టీలు కొన్ని స్థానాల్లో మాత్రం ఉమ్మడి అభ్యర్థులను కాకుండా ఎవరికి వారే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటు పొత్తు ధర్మం వీడలేక అటు అభ్యర్థులను కాదనలేక చివరకు ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అంటూ కొత్త రాగాన్ని వినిపిస్తున్నాయి. 

స్నేహపూర్వక పోటీ పేరుతో కూటమిలోని పార్టీలు కొన్ని స్థానాల్లో పోటీకి దిగుతున్నాయి. రాజకీయాలంటేనే ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలియని పరిస్థితులు. అలాంటి సందర్భంగా కలిసి పోటీ చేయాలనుకున్న పార్టీలు సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర పోషించిన కూటమిలో జనసమితికి 8 సీట్లు కేటాయించగా అందులో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలోకి దిగడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

నామినేషన్ల గడువు మరికొన్ని గంటల్లోనే ముగుస్తుండగా అనూహ్యంగా పార్టీలు ఎదురుతిరిగాయి. 94 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రస్తుతానికి 99 మంది అభ్యర్థులకు బీ ఫామ్స్‌ అందజేసింది. దుబ్బాక, మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కూడా అభ్యర్థులను బరిలోకి దించడంతో ఆయా నియోజకవర్గాల్లో జనసమితి, కాంగ్రెస్‌ మధ్య స్నేహపూర్వక పోటీ అని చెప్పుకొస్తున్నారు. 

అలాగే మహబూబ్‌నగర్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించగా ఆ స్థానంలో జనసమితి అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో అక్కడ టీడీపీ, టీజేఎస్‌ మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అని చెబుతున్నారు. ఇటు పటాన్‌చెరు స్థానంపై టీడీపీ వర్సెస్ కాంగ్రెస్‌ గా మారింది. మొదటి నుంచి పటాన్‌చెరు సీటు కావాలంటూ టీడీపీ పట్టుబడుతోంది. ఇప్పటికే అక్కడి నుంచి టీడీపీ నుంచి నందీశ్వర్‌గౌడ్‌ నామినేషన్ కూడా వేశారు. అయితే ఇవాళ కాంగ్రెస్‌ అదే స్థానం నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్‌ కు కాంగ్రెస్‌ బీ ఫామ్ అందజేయడంతో కలకలం రేపుతోంది. అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా టీడీపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. 

English Title
New Twist In Mahakutami | Friendly Contest Likely in Select Seats

MORE FROM AUTHOR

RELATED ARTICLES