హోదా పోరులో కొత్త ట్విస్ట్...

Submitted by arun on Sat, 08/04/2018 - 11:27

హోదా పోరులో బిజెపి, టిడిపి మధ్య యుద్ధం కొత్త రూపు తీసుకుంటోంది. పార్లమెంటులో టిడిపి నిరసనల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. 

హోదా కోసం పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్న టిడిపిని గట్టిగా దెబ్బ తీయడానికి బిజెపి తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్లమెంటులో టిడిపి ఎంపీలు పదే పదే హోదా నినాదాలు చేయడం, ప్రాంగణం బయట ఆవరణలో ప్లకార్డులతో నినాదాలివ్వడం మామూలే హోదా పోరు సీరియస్ గా మారాక వైసిపి కూడా గత పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు ప్రాంగణం బయట నినాదాలిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. లోక్ సభ లోపలికి వెళ్లే ప్రాంతంలో లేదా, గాంధీ విగ్రహం ముందు నిలబడి ఎంపీలు ఈ నినాదాలివ్వడం ఆనవాయితీ అయితే వైసిపి ఎంపీల రాజీనామా తర్వాత ఆ పార్టీ ఈ తరహా నిరసనలకు దిగే ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు టిడిపి ఎంపీలు హోదా పోరాటంపై తమ బ్రాండ్ తీసుకు రాడానికి ప్రతీరోజూ ప్రయత్నిస్తున్నారు. లోక్ సభ ప్రారంభం కాగానే, ఆతర్వాత సభ బయటా టిడిపి ఎంపీలు నినాదాలివ్వడం, ప్లకార్డులు పట్టుకోడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో టిడిపి ఎంపీలపై అధినేత చంద్రబాబు ఒత్తిడి కూడా ఉంది. హోదా కోసం పోరాడుతున్న పార్టీగా ముద్ర వేసుకోడానికి అటు సిఎం చంద్రబాబు రాష్ట్రంలో సభల్లో మాట్లాడుతుంటే, ఇటు ఢిల్లీలో టిడిపి ఎంపీలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. వీరందరిలోకీ కీలకమైన వ్యక్తి చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్. 

ఆయన రోజుకో వేష ధారణతో పార్లమెంటు బయట కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అందరి కంటా పడుతున్నారు. ఈ వేషాల వల్ల తమకు మైలేజీ వస్తోందని టిడిపి కూడా సంతోషిస్తోంది. అయితే మొన్నటి రాజ్యసభ చర్చలో బిజెపి ఎంపీ జీవీఎల్ ప్రసంగం తర్వాత టిడిపి ఎంపీలకు ఆయనకు మధ్య వార్ తారస్థాయికి చేరింది. తనను నానా దుర్భాషలాడారంటూ ఆయన స్పీకర్ కు కంప్లయింట్ కూడా చేశారు టిడిపి ఎంపీలపై హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదిచ్చారు. అదే జీవీఎల్ ఇప్పుడు టిడిపి పై మరో పోరాటానికి సిద్ధపడ్డారు. టిడిపి డ్రామాల పార్టీ అనీ ఈ డ్రామాలన్నింటికీ ముగింపు చెబుతాననీ అంటున్నారు.

హోదాపై టిడిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి గణాంకాల సాయంతో పోరాడుతున్న జీవీఎల్ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వేష ధారణపైనా స్పీకర్ కు కంప్లయింట్ చేశారు. టిడిపి ఎంపీల డ్రామాలు రోజు రోజుకూ ముదురుతున్నాయని వీటికి చెక్ చెప్పాల్సిన సమయం వచ్చిందనీ ఆయనంటున్నారు పార్లమెంటు ప్రాంగణంలో ఇలాంటివి చేయడం తగదని  పార్లమెంటు నిబంధనలను ఆయన ప్రస్తావిస్తున్నారు. జీవీఎల్ ఫిర్యాదు పనిచేసి టిడిపి ఎంపీల చర్యలను నియంత్రిస్తే టిడిపి మైలేజీకి దెబ్బ పడినట్లే..  బిజెపి వేస్తున్న ఈ ఎత్తుగడని టిడిపీ ఎంపీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వేషాల స్పెషలిస్ట్ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బిజెపి అభ్యంతరాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
 

English Title
New Twist in AP Special Status

MORE FROM AUTHOR

RELATED ARTICLES