రాఫెల్‌ విమానాలపై ఆగని యుద్ధం..శతఘ్నుల్లా పేలుతున్న అస్త్రాలు

రాఫెల్‌ విమానాలపై ఆగని యుద్ధం..శతఘ్నుల్లా పేలుతున్న అస్త్రాలు
x
Highlights

సరిహద్దుల్లో యుద్ద విమానాలు ఎగురుతున్నాయ్. స్వదేశంలో మాటల తూటాలు పేలుతున్నాయ్. నింగిలో వార్‌ జెట్స్ రయ్యిన దూసుకెళ్తున్నాయ్. నేల మీద డైలాగ్స్‌ వార్స్...

సరిహద్దుల్లో యుద్ద విమానాలు ఎగురుతున్నాయ్. స్వదేశంలో మాటల తూటాలు పేలుతున్నాయ్. నింగిలో వార్‌ జెట్స్ రయ్యిన దూసుకెళ్తున్నాయ్. నేల మీద డైలాగ్స్‌ వార్స్ హీటెక్కిస్తున్నాయ్. మన యద్ధతంత్రానికి, రాఫెల్‌ యంత్రం కొత్త శక్తినిస్తుంటే, అదే రాఫెల్‌ చుట్టూ ఆరోపణాస్త్రాలు చక్కర్లు కొడుతున్నాయ్. అధునాతన విమానాలను రణవ్యూహం కోపం రప్పిస్తుంటే, అదే విమానాలపై రాజకీయ రణతంత్రం అనేక ఆయుధాలు సంధిస్తోంది. ఎగురుతున్న యుద్ధ విమానాల సాక్షిగా, మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఈ మాటల తూటల మంటల్లాంటి వెపన్స్‌ ఏంటో అవును. రాఫెల్‌ యుద్ధ విమానాలు. ఫ్రాన్స్‌ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న అత్యున్నత సాంకేతిక వార్‌ ప్లేన్స్. కొన్ని నెలల నుంచి రాఫెల్‌ జెట్స్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం తీర్పుతో మరో మలుపు తిరిగినా, పార్లమెంట్‌ సాక్షిగా ఇంకో టర్న్‌ తీసుకుంటోంది. ఇంతకీ రాఫెల్‌ డీల్‌లో ఏం జరిగింది. మోడీ పాలిట ఇది మరో బోఫోర్స్‌గా పరిణమిస్తుందా...లేదంటే కాంగ్రెస్‌పైనే రివర్స్‌ అటాక్‌ చేస్తుందా..?

కాలం చెల్లిన యుద్ధ విమానాలున్న మన సైన్యానికి, రాఫెల్‌ జెట్స్‌ కొత్త కాన్ఫిడెన్స్‌ ఇచ్చాయి. అనేక యుద్ధ విమానాలతో సరిహద్దుల్లో కవ్విస్తున్న చైనా, పాకిస్తాన్‌లకు, రాఫెల్‌ జెట్స్‌, గట్టి హెచ్చరికలన్న వ్యాఖ్యానాలు జోష్‌నిచ్చాయి. తన ఉనికిని శత్రువులకు ఇవ్వకుండా, వారి స్థావరాలను ఈజీగా పసిగట్టే అధునాతన రాఫెల్‌లు, ఇండియా సొంతమయ్యాయని, ప్రపంచ దేశాలు అభివర్ణించాయి. కానీ ఫ్రాన్స్‌‌తో కుదుర్చుకున్న రాఫెల్‌ డీల్, అనేక మలుపులు తిరుగుతుండటం, ఆందోళన కలిగిస్తోంది. రాఫెల్‌ చుట్టూ సందేహాలు చక్కర్లు కొడుతుండటం, రాజకీయ రణక్షేత్రాన్ని వేడెక్కిస్తోంది. తాజాగా ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ చేసిన కామెంట్లు, మరింత కాకరేపుతున్నాయి. కాలం చెల్లిన యుద్ధ విమానాలతో అవస్థలు పడుతున్న భారత వైమానిక దళానికి, రాఫెల్‌ ఒప్పందం కొత్త శక్తినిచ్చింది. ఇదిగో అధునాతన వార్‌ జెట్స్‌ అంటూ ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపింది. యుద్ధ తంత్రానికి కొత్త యంత్రంగా రాఫెల్‌ రొమ్మువిరుచుకుని బోర్డర్‌లో నిలబడితే, ఇప్పుడే అదే రాఫెల్‌ చుట్టూ రాజకీయ రణరంగం అలుముకుంటోంది.రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంపై నాడు విపక్షాలు బోఫోర్స్‌ రూపంలో శతఘ్నులు పేల్చితే, మోడీ పాలిట రాఫెల్‌ను మరో బోఫోర్స్‌గా సంధించేందుకు, కాంగ్రెస్ రణవ్యూహంతో చెలరేగిపోతోంది.

కొన్ని నెలల నుంచి రాఫెల్‌ కొనుగోళ్లపై కాంగ్రెస్‌, ఉద్యమరీతిలో, మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2019లో ఇదే ఆయుధంగా మోడీని గద్దెదించాలని దీటుగా బదులిస్తోంది. డిఫెన్స్‌లో పడి, రకరకాల కారణాలతో సమాధానం చెప్పలేకపోతున్న బీజేపీ, ఎదురుదాడి చేస్తోంది. ఇదే సమయంలో, సుప్రీం కోర్టు మోడీ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. రాఫెల్‌ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. రాఫెల్‌ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను తోసిపుచ్చింది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీలేవని జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని స్పష‌్టం చేసింది. సహజంగానే సుప్రీం తీర్పు మోడీ సర్కారుకు ఊరటనివ్వడమే కాదు, కాంగ్రెస్‌పై ఎదురుదాడికి ఆయుధాన్నిచ్చింది.

అయితే, సుప్రీం కోర్టుకు తప్పుడు నివేదికలిచ్చి, దారి తప్పించారని కాంగ్రెస్‌ మళ్లీ అటాక్ మొదలెట్టింది. పార్లమెంట్‌‌లోనూ ఇదే విషయాన్ని లేవనెత్తుతోంది. అటు సుప్రీంకోర్టే తీర్పును ధిక్కరించేలా, సైన్యాన్ని అవమానించేలా రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని, సభలోనే దీటుగా జవాబిచ్చింది బీజేపీ. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇరువురి ఆందోళనలతో ఉభయసభలూ స్తంభించిపోయాయి. స్కూలు పిల్లల్లా అల్లరి చేస్తున్నారని సభ్యులపై సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్‌పై అధికార, విపక్షాల మధ్య గొడవ సాగుతుండగానే, ఎయిర్‌ ఫోర్స్ చీఫ్‌ బీఎస్ ధనోవా చేసిన కామెంట్లు మరింత కాకరేపాయి. రాఫెల్ జెట్ల కొనుగోళ్లతో వైమానికదళం బలోపేతానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. కొనుగోళ్లపై ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఎయిర్‌ ఫోర్స్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీఎస్ ధనోవా అబద్దాలు ఆడుతున్నారని, నిజాలు దాస్తున్నారని, ఆయనకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించింది. రాఫెల్‌ ఒప్పందాన్ని పట్టపగలు దొంగతనంగా అభివర్ణించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ. 200 శాతం అంచనాలు పెంచి రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా కొన్నారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories