ఈ నలుగురిలో కేంద్ర మంత్రి ఎవరు..?

ఈ నలుగురిలో కేంద్ర మంత్రి ఎవరు..?
x
Highlights

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా నాలుగు స్థానాలను దక్కించుకుంది. పార్టీ పుంజుకోవడానికి దక్కిన ఈ అవకాశాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ...

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా నాలుగు స్థానాలను దక్కించుకుంది. పార్టీ పుంజుకోవడానికి దక్కిన ఈ అవకాశాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. పార్టీ బలోపేతం కోసమైనా కేంద్ర కేబినెట్ లో తెలంగాణను ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టనుండటంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అన్యూహ్యంగా నాలుగు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీల్లో ఎవరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనే విజయం సాధించింది. సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందిన దత్తాత్రేయకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారు. కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత దత్తాత్రేయను తొలగించారు. దీంతో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందడంతో కేంద్ర కేబినెట్‌లో ఒకరికి మాత్రం బెర్తు ఖాయంగా కనిపిస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ తరుపున సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్‌, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్‌, ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపురావు గెలిచారు. ఈ నలుగురిలో ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు లభిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నలుగురూ ఎంపీలుగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. వీరిలో కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీలో సీనియర్‌ నేత. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో కేంద్రమంత్రిగా ఆయనకే అవకాశాలెక్కువ ఉన్నాయి. యువకులకు అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తే, కిషన్ రెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే, యువతను ఆకర్షించి కరీంనగర్‌ లోక్‌సభ నుంచి గెలుపొందిన బండి సంజయ్‌కి కూడా కేంద్రమంత్రి పదవి దక్కవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం సంజయ్ వైపు మొగ్గు చూపవచ్చని కూడా పార్టీ నేతలు అంటున్నారు.

నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ కి సైతం కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్ కుమార్తె, కవిత నుంచి గట్టి పోటీ ఎదురైనా 68వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అదివాసి తెగకు చెందిన‌ సోయంకు మంత్రిగా అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సామజిక సమీకరణల పరంగా తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు.

తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి మంచి అవకాశం దక్కింది. ఊహించని విధంగా ఆ పార్టీకి రెండు సీట్లు బోనస్‌గా కలిసి వచ్చినట్లే. రెండు సీట్లు మాత్రమే గెలుస్తుందని భావించినా నాలుగు సీట్లను రాబట్టుకుంది. పార్టీ పుంజుకోవడానికి దక్కిన ఈ అవకాశాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. కాబట్టి ఈసారి కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు ప్రాతినిధ్యం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories