మొత్తం తొమ్మిది దశల్లో ఎత్తిపోతల ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరు ..

మొత్తం తొమ్మిది దశల్లో ఎత్తిపోతల ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరు ..
x
Highlights

ప్రపంచంలోనే మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందనుంది. నీరు పల్లమెరుగనే సహజ సూత్రానికి భిన్నంగా దిగువ నుంచి...

ప్రపంచంలోనే మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందనుంది. నీరు పల్లమెరుగనే సహజ సూత్రానికి భిన్నంగా దిగువ నుంచి ఎగువకు నీటిని తరలించే అతి పెద్ద ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయ వంతంగా పూర్తి చేసింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి చివరి వరకు 524 మీటర్ల పైనే ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఇందుకోసం తొమ్మిది దశల్లో ఎత్తిపోతల ప్రాజెక్టులను నీటి పారుదల శాఖ అధికారులు పూర్తి చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ప్రాంతమైన మేడిగడ్డ సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నిర్మించిన కన్నేపల్లి పంప్‌ హౌస్‌లో 50 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 9 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటి నిల్వలు 4.47 టీఎంసీలకు చేరుకోగానే 21 మీటర్లు ఎత్తిపోసి అన్నారం బరాజ్‌లోకి తరలిస్తారు.

అన్నారం బారేజ్‌లో నీటి నిల్వలు 4.25 టీఎంసీలకు చేరుకోగానే ... ఇక్కడ ఏర్పాటు చేసిన 30 మెగావాట్ల 9 మోటర్లు 11 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయనున్నాయి. ఇక్కడి నుంచే సుందిళ్ల బ్యారేజ్‌ నీటిని తరలించనున్నారు.

మూడో దశలో అత్యంత కీలకమైన సుందిళ్ల బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించనున్నారు. ఇక్కడి 40 మెగావాట్ల 9 మోటర్లు ... సుమారు 16 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయనున్నాయి. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయనున్నారు.

ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్‌, రెండు టన్నెళ్ల ద్వారా మేడారం పంప్ హౌస్‌కు అటు నుంచి రామడుగులోని మహా బావికి తరలించనున్నారు. ఇక్కడ సుమారు 85 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక్కడ 124 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఏడు మోటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

ఇక్కడి నుంచే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఐదో దశ ప్రారంభం కానుంది. మహా బావి నుంచి రామడుగుకు నీటిని ఎత్తి పోయేందుకు బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7మోటర్ల ద్వారా రోజుకు 1.9 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ మోటర్ల ద్వారా 87 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తి SRSP కాలువలో ఎత్తిపోయనున్నారు. ఇక్కడి నుంచి మిడిమానేర్‌కు నీరు చేరుకోనుంది.

ఇక మిడ్ మానేరు నుంచి గ్రావెటి కెనాల్‌, టన్నెల్ ద్వారా 77మీటర్ల ఎత్తులో ఉన్న అనంతగిరి పంప్ హాస్‌కు ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. ఇక్కడ 106 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన నాలుగు మోటర్లను ఏర్పాటు చేసారు. దీని ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోయనున్నారు.

ఏడవ దశలో రంగనాయక్ సాగర్ పంప్‌హౌస్‌కు తరలించనున్నారు. 83 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక్ పంప్‌ హౌస్‌‌కు అనంతగిరి పంప్ హౌస్ ద్వారా నీరు చేరుకోనుంది.

రంగనాయక్ సాగర్ దగ్గరకు నీరు చేరుకున్న అనంతరం ... మల్లన్న సాగర్‌కు తరలించనున్నారు. 134.8 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన నాలుగు మోటర్లను ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున 77 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్న సాగర్‌‌కు నీటిని ఎత్తిపోయనున్నారు.

చివరి దశలో మల్లన్న సాగర్ నుంచి తెలంగాణలో అత్యంత ఎత్తయిన ప్రదేశమయిన కొండ పొచమ్మ సాగర్‌కు నీరు చేరుకోనుంది. సుమారు 67 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ సాగర్‌‌కు 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. దీంతో సముద్ర మట్టానికి 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ సాగర్‌కు నీరు చేరుకోనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories