తమిళనాడు, కర్ణాటకలో పోటెత్తిన ఓటర్లు...క్యూ లైన్లో నిల్చొని ఓటేసిన పళని, కమల్‌..

తమిళనాడు, కర్ణాటకలో పోటెత్తిన ఓటర్లు...క్యూ లైన్లో నిల్చొని ఓటేసిన పళని, కమల్‌..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండోదశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఎన్నికలు...

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండోదశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. బరిలో మొత్తం 16 వందల 11 మంది అభ్యర్థులున్నారు. తమిళనాడులో 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోం, బీహార్‌, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌‌, పశ్చిమ బెంగాల్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్‌ జరుగుతుంది.

మరోవైపు రెండోదశ ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచారు. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని తూర్పు-త్రిపుర లోక్‌సభ స్థానం ఎన్నిక మూడో దశకు వాయిదా పడడంతో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల సంఖ్య 95 కు తగ్గింది.

తమిళనాడులో 38 లోక్‌సభ నియోజకవర్గాలకు తోడుగా 18 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా మధురైలో మాత్రం రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసేశారు. ఇటు ఈ ఎన్నికల్లో దినకరన్‌ పార్టీతో పాటు కమలహాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పార్టీ కూడా పోటీలో వుంది. ఇక ఇదే దశలో ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి కూడా పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్‌, జ్యుయల్‌ ఓరం, సదానందగౌడ, పొన్‌ రాధాకృష్ణన్‌, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్‌, ఎ.రాజా, కనిమొళి వంటి ప్రముఖుల భవితవ్యం తేలనుంది.

ఇక ఈ ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి ఓటేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో క్యూ లైన్‌లో నిల్చుని ఓటేశారు. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం తన సతీమణీతో కలిసి కారయ్‌కుడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఓటేశారు. అలాగే అళ్వారుపేట ప్రభుత్వ కాలేజీలో మరో హీరో కమల్‌హసన్‌, ఆయన కూతరు శృతిహసన్‌ ఓటేశారు. మరోవైపు మహారాష్ట్రలో సుశీల్‌ కుమార్‌ షిండే, బెంగళూరులో రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.














Show Full Article
Print Article
Next Story
More Stories