బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్..నడ్డాకు దక్కింది

బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్..నడ్డాకు దక్కింది
x
Highlights

భారతీయ జనతా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తక్షణం...

భారతీయ జనతా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తక్షణం బాధ్యతలు స్వీకరించాలని అధిష్టానం ఆదేశించింది. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా నియామకం. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జయప్రకాశ్‌ నడ్డా నియమితులయ్యారు. సోమవారం సాయంత్రం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డాను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్న బీజేపీ కొత్త బాధ్యతలను నడ్డా స్వీకరించినట్లు తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడ్డా గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

రెండో దఫా అధికారంలోకొచ్చిన బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఇటీవల ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా అమిత్ షా పదవీ కాలం పొడగిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణ‍యం తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో జేపీ నడ్డాకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వ్యూహాలను రూపొందించడం వాటిని అమలు పర్చడంలో దిట్ట అయిన జేపీ నడ్డా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌కు ఇంచార్జీగా వ్యవహరించారు. ఓ వైపు మహా ఘట్‌బంధన్‌ మరోవైపు కాంగ్రెస్‌ బడా లీడర్లు ఎంతగా ప్రచారం చేసినా 64 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీన్ని భారీ విజయంగా ఆ పార్టీ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యాణ రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది మొదట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఢిల్లీలో అధికారం కోసం విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నడ్డాను నియమించినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories