అంబానీవారి కళ్యాణం

Submitted by arun on Mon, 03/05/2018 - 11:40
akash ambani

దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. 

జియో ఇన్ఫోకామ్ వ్యూహకర్త, ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ ఓ ఇంటివాడవుతున్నారు. వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకతో ఆకాశం వివాహం చేయడానికి అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. 

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలసి చదువుకున్న ఆకాశ్, శ్లోక అక్కడే ప్రేమలో పడ్డారని, 12వ తరగతి పూర్తవగానే ఆకాశ్ తన ప్రేమను శ్లోకతో వ్యక్తపరిచి అనంతరం ఇరు కుటుంబాలకు చెప్పారని తెలుస్తోంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అర్ధశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆకాశ్ మంచి ఫోటో గ్రాఫర్, జంతుప్రేమికుడు.

ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయవిద్యలో మాస్టర్స్‌ పూర్తి చేసిన శ్లోక.. రసెల్ మెహతా, మోనాల ముగ్గురు సంతానంలో చిన్నది. ప్రస్తుతం రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్లోక ఎన్జీవోలను, వాలంటీర్లను ఒకే వేదికమీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన కనెక్ట్ ఫర్.. అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. ఆకాశ్- శ్లోక పెళ్లి గురించి మాట్లాడటానికి ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడలేదు. కాగా పీఎన్బీ కుంభకోణం ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ.. రసెల్ మెహతా బంధువులు. 
 

English Title
mukesh ambanis son akash ambani Marriage with shloka mehta

MORE FROM AUTHOR

RELATED ARTICLES