కాపు రిజర్వేషన్లపై దుమారం రేపుతున్న జగన్‌ వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 07/30/2018 - 11:15

కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు కాపుల్లో అగ్గిరాజేస్తున్నాయ్. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లను మద్దతు పలికిన జగన్‌ తాజాగా మాట మార్చడంపై ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారన్న వైసీపీ నేత కన్నబాబు కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎక్కడా చెప్పలేదన్నారు. మరోవైపు జగన్‌‌కు కాపుల సెగ స్టార్టయింది. 

కాపు రిజర్వేషన్లు చేయలేనని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమం ఎక్కడైతే పుట్టిందో అక్కడే కాపులను బీసీల్లో చేర్చడం కుదరదని మాట్లాడటం ఎంతవరకూ న్యాయమన్నారు. పదవి కోసం జగన్‌కు ఎంత ఆరాటం ఉందో కాపు రిజర్వేషన్‌పై తమకు అంతే ఆరాటం ఉందన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్లు తాగుతూ మీ పల్లకీలు మోస్తుండాలా? అంటూ జగన్‌ను ఘాటుగా ప్రశ్నించారు ముద్రగడ.

కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఓ వర్గం వక్రీకరించిందని వైసీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. కాపు రిజర్వేషన్లనకు వ్యతిరేకమని జగన్‌ ఎక్కడా చెప్పలేదన్న ఆయన కాపుల రిజర్వేషన్లపై ఇప్పటికీ చిత్తశుద్దితో ఉన్నామని కన్నబాబు స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టినప్పుడు, ఇళ్లలో నిర్భందించినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని, వాస్తవ పరిస్థితులను చెబితే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో జరుగుతున్న పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దాపురంలో పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు, జగ్గంపేట బహిరంగ సభలో కాపులకు రిజర్వేషన్‌ హామీ ఇవ్వలేనని చేసిన వ్యాఖ్యలు జగన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నాయ్. గోనాడ పాదయాత్ర శిబిరం నుంచి జగన్‌ బయలుదేరిన పది నిమిషాల్లోనే గోనాడలో కాపు వర్గీయులు తమను మోసగించొద్దంటూ ఫ్లకార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.

English Title
Mudragada Padmanabham Fires On YS Jagan Over His Comments On Kapu Reservation Bill

MORE FROM AUTHOR

RELATED ARTICLES