ఈ నెలాఖరు లేదా మే తొలి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశం

ఈ నెలాఖరు లేదా మే తొలి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశం
x
Highlights

ఈ నెలాఖర్లో లేదా మే మొదటి వారంలో తెలంగాణా అసెంబ్లీ సమావేశం కానుంది. కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను చట్ట రూపంలోకి తీసుకొచ్చేందుకే సమావేశ ఏర్పాటు...

ఈ నెలాఖర్లో లేదా మే మొదటి వారంలో తెలంగాణా అసెంబ్లీ సమావేశం కానుంది. కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను చట్ట రూపంలోకి తీసుకొచ్చేందుకే సమావేశ ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు నిర్వహించే సమావేశాలు జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టం రూపొందిస్తుండటంతో సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు ఏ రకంగా ఉన్నాయన్న దానిపై సమీక్షించారు. రెవెన్యూపై 34 రకాల చట్టాలున్నాయని గుర్తించిన సీఎం వీటన్నంటిని అధ్యయనం చేసి మార్పులు, చేర్పులు చేసి కొత్తగా బిల్లును రూపొందించనున్నారు. ఈ బిల్లులో జిల్లా కలెక్టర్ల పేరు మార్పు, విధులలో గణనీయమైన మార్పులు చేయనున్నారు. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట రూపంలోకి తీసుకురానున్నారు.

ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో కూడా భారీ మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ అధికారాలకు కత్తెర వేసి జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని భావిస్తున్నారు. లే ఔట్లు, నిర్మాణ అనుమతులు, పన్నులు ఖరారు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ రెండు బిల్లులు సిద్దం కాగానే ఈ నెలాఖరు లేదా, మే మొదటి వారంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చి వీటిని ఆమోదించాలని భావిస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం పొందిన తర్వాత జూన్ రెండో వారంలోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories