ఆ జిల్లాకు ఆరోగండం...పొన్నూరులో గెలుపెవరిది?

ఆ జిల్లాకు ఆరోగండం...పొన్నూరులో గెలుపెవరిది?
x
Highlights

ఇప్పటివరకూ ఆయనకు ఓటమి లేదు రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం ఆయనదే జిల్లాలో ఇప్పటివరకూ ఏ పొలిటీషియన్ డబల్ హాట్రిక్ విజయాలు సాధించిన దాఖలాలు...

ఇప్పటివరకూ ఆయనకు ఓటమి లేదు రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం ఆయనదే జిల్లాలో ఇప్పటివరకూ ఏ పొలిటీషియన్ డబల్ హాట్రిక్ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. అంటే వరుసగా ఐదుసార్లు గెలిచిన నేత, ఆరోసారి ఓడిపోతూ వస్తున్నారు. మరి ఆరోసారి బరిలో దిగిన ఆయన చరిత్ర సృష్టిస్తారా ఇప్పుడిదే గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు వరుస విజయాలు ఆ‍యన సొంతం. రాజకీయాల్లోకి వచ్చింది మొదలు, ఆ‍యనకు అపజయం అన్నది ఎదురుకాలేదు. ప్రత్యర్థి ఎవరైనా విజయం మాత్రం ఆ‍యనదే అన్నంతగా ఆయన జైత్రయాత్ర కొనసాగింది. ఈసారి ఆరోసారి సైతం బరిలో నిలిచారు. కానీ ఓటమి ఎరుగని ఆ నేతలో, ఇప్పుడు టెన్షన్‌ కనిపిస్తోంది తెలుసా ప్రత్యర్థి బలమైనవాడనో, మరో పార్టీ ఊపు వీస్తోందనో కాదు ఆ టెన్షన్. అది ఒక నెంబర్‌కు సంబంధించిన టెన్షన్. అదే ఆరు. ఆ సిక్స్‌ ఆయనలో అలజడి రేపుతోంది. జిల్లాలో ఇప్పుడదే మాట అందరి నోటా. ఇంతకీ ఎవరా నాయకుడు ఎందుకంత టెన్షన్ ఆరో నెంబర్‌ ఎందుకు ఆందోళనకు కారణమవుతోంది.

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నేత ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి కొడుకు. తెలుగుదేశం నుంచి మొదటిసారిగా పొన్నూరు నుంచి బరిలో దిగి విజయం సాధించారు. రెండోసారి 1985 ఎన్నికలలో మరోసారి గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో వీరయ్య చౌదరి మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో వీరయ్య చౌదరి మరణించడంతో, తనయుడు నరేంద్ర కుమార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత తిరుగులేని నేతగా పొన్నూరులో ఎదిగారు.

1994 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. తర్వాత 1999 ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించారు. 2004లోనూ, మూడోసారి కాంగ్రెస్ గాలిలో కూడా విజయంతో హాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో కూడా నరేంద్ర నాలుగోసారి పోటీ చేసి ప్రత్యర్థిపై విజయం సాధించారు. 2014 ఎన్నికలు కూడా ధూళిపాళ్ల విజయాన్ని ఆపలేకపోయాయి. అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 2019 అంటే, ఆరోసారి పోటీపడ్డారు నరేంద్ర. అదే ఆ‍యనలో టెన్షన్ పుట్టిస్తోందంటే నమ్మగలరా?

ఐదుసార్లు విజయం సాధించిన వ్యక్తికి, ఆరోసారి పెద్ద లెక్క కాకపోవచ్చన్నది అందరూ చెప్పే మాట. కానీ ఆరోసారి మాత్రం, ధూళిపాళ్లను ఒక అనుమానం వెంటాడుతోంది. తన జైత్రయాత్రకు ఆ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేస్తుందని ఆయన మధనపడుతున్నారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్‌ తిరుగులేని నాయకునిలోనూ ఎందుకంత అలజడి పుట్టిస్తోంది.

గుంటూరు జిల్లాలో వరుసగా ఐదుసార్లు గెలిచిన ఘనత కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణలు మాత్రమే. 2014ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నరేంద్ర వీరితో సమానంగా చేరారు. అయితే ఆరోసారి బరిలోకి దిగిన ఎవరూ, జిల్లాలో గెలుపొందలేదు. అదే దూళిపాళ్లను భయపెడుతోంది.

2004ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్యలు ఆరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలా ఐదుసార్లు గెలిచిన ముగ్గురు అభ్యర్దులు రకరకాల కారణాలతో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోసారి ఎన్బికల బరిలో దిగారు. ఈ పోరులో నరేంద్ర గెలిస్తే జిల్లాలో ఆరోసారి విజయం సాధించిన తొలి పొలిటీషియన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఆరో గండాన్ని గట్టెక్కిన మొనగాడిగా కితాబులందుకుంటారు. కానీ సెంటిమెంట్‌ రిపీట్ అయితే ఏంటన్నది ఆయనను వెంటాడుతున్న ఆందోళన.

గత ఐదు ఎన్నికల్లో నరేంద్ర కుమార్ ప్రతిసారి కొత్త ప్రత్యర్దితోనే తలపడి విజయం సాధించారు. ఆరోసారి కూడా కొత్త ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర చేతిలో ఓటమిపాలైన రావి వెంకటరమణ మరోసారి తలపడతారని అందరూ భావించారు. అనుహ్యంగా జగన్ రావిని కాదని చివరి నిమిషంలో కిలారి రోశయ్యను వైసీపీ తరపున బరిలో దించారు. దీంతో అప్పటివరకూ పొన్నూరు ఇన్‌ఛార్జిగా ఉన్న రావి, అసంతృప్తితో రగిలిపోయారు. అయితే అందరూ సర్దిచెప్పినా రావి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి పూర్తిస్థాయిలో సహకరించలేదన్న ఆరోపణలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.

వరుసగా ప్రతి ఎన్నికలోనూ కొత్త ప్రత్యర్దిని ఎదుర్కొంటూ ధూళిపాళ్ళ విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కూడా రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు దీమాగా చెబుతున్నారు. అదే జరిగితే నరేంద్ర వరుసగా డబుల్ హాట్రిక్ విజయాలు సాధించిన తొలి గుంటూరు నేతగా రికార్డు సృష్టించడం ఖాయం. ఇప్పటి వరకూ ఎంత పెద్ద లీడర్ అయినా జిల్లాలో ఆరోసారి విజయం సాధించలేక ఓటమి పాలవుతూనే ఉన్నారు. కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణ వంటి హేమాహేమీలు కూడా ఆరోసారి గెలవలేకపోయారు. అయితే ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ధూళిపాళ్ళ నరేంద్ర ఆరోసారి గెలవడం ఖాయమంటున్నారు టీడీపీ అభిమానులు. మరోవైపు ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉందని, నరేంద్ర ఓడిపోతారని వైసీపీ వర్గీయులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆరో గండం కూడా ధూళిపాళ్లను వెంటాడుతోందని గుర్తు చేస్తున్నారు. మరి పొన్నూరులో కొత్త ప్రత్యర్ది సెంటిమెంట్ కలిసొచ్చి నరేంద్ర కుమార్ విజయం సాధిస్తారో లేక ఫ్యాన్ గాలితో ఎదురీదుతారోనని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories