డీఎస్‌పై చర్యలు తీసుకోండి

Submitted by arun on Wed, 06/27/2018 - 12:57
ds

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా నాయకత్వం తీర్మానం చేసింది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖరాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. మొత్తం 9 నియోజకవర్గాల్లోనూ గెలిపించి తెరాస అధికారంలోకి రావడానికి సహకరించారు. అందుకే ఈ జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పలేనంత అభిమానం. ఆ కారణంతో జిల్లాలో సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్న డీఎస్‌ పార్టీలోకి వస్తానంటే కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. అంతర్రాష్ట్ర సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. తదనంతరం రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం కల్పించారు. 

సీఎం ఆదేశాల మేరకు జిల్లా నేతలంతా ఆయనకు సముచిత గౌరవం ఇస్తూ వచ్చారు. అయితే ఇటీవల డీఎస్‌ కుమారుడు భాజపాలో చేరారు. అప్పట్నుంచీ ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తన కుమారుడు ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఆరేడు నెలలుగా డీఎస్‌ తెరాస కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఓ వ్యక్తి వల్ల కింది కేడర్‌ ఇబ్బందులు పడుతున్నందునే మేం బయటకు రావాల్సి వచ్చింది. కుటుంబంలో అభిప్రాయ బేధాలుంటే ఆయన వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి. అంతేగానీ పార్టీని నాశనం చేసేలా వ్యవహరించకూడదు. పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానానికి తెలియజేయాల్సిందిగా నిజామాబాద్‌ జిల్లా తెరాస అధ్యక్షురాలు తుల ఉమకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆవేదనను తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశాం. పార్టీకి వ్యతిరేకంగా నా బిడ్డలు వ్యవహరించినా కఠినచర్యలు తప్పవని కేసీఆర్‌ తరుచూ హెచ్చరిస్తుంటారు. డీఎస్‌ వ్యవహారంలోనూ అలాగే ఉండాలని కోరుతున్నాం. పార్టీలో ఇలాంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ జిల్లా మొత్తం తెరాస జెండా రెపరెపలాడించవచ్చు. తెరాస క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించవద్దని అధినేతను కోరుతున్నాం’ అని అన్నారు.
 

English Title
MP Kavitha Proposes to Squash Out D Srinivas from TRS

MORE FROM AUTHOR

RELATED ARTICLES