యూత్ కోసమే హిప్పీ..

యూత్ కోసమే హిప్పీ..
x
Highlights

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీ. బోల్డ్ నటనతో యువతలో స్థానం సంపాదించిన...

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీ. బోల్డ్ నటనతో యువతలో స్థానం సంపాదించిన కార్తికేయ ఈ సినిమాలోనూ దానిని అనుసరించాడు. ఇక ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కూడా ఉండడంతో సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించిన హిప్పీ.. ఎలా ఉన్నాడు.. ఆకట్టుకున్నాడా.. లేదా.. ఒకసారి చూద్దాం..

మనం ఎవరినైనా ప్రేమించడం బాగానే ఉంటుంది.. అవతలి వాళ్లు తిరిగి మనల్ని ప్రేమించేటపుడే మొదలవుతుంది తంటా.. ఈ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ హిప్పీ.. యువతరం ప్రేమకు సంబంధించి ఇటీవల వస్తున్నా కథనాల్లో ఇదొక కొత్తకోణం గా చెప్పుకోవచ్చు. వారు ప్రేమిస్తున్నంత సేపూ అవతలి వారి ప్రేమకోసం ఎదురుచూసే యువకులకు.. అవతలి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకా మొదలవుతాయి తిప్పలు. దాదాపుగా వారి స్వేచ్ఛ హరించుకుపోతుంది. ప్రేమలో ఉండే సున్నితత్వాన్ని అర్థం చేసుకోకపోతే కుర్రాళ్లు పడే ఇబ్బందుల చిత్రీకరణే ఈ హిప్పీ.. కుర్రతనం కథల్ని తెరకెక్కించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం అవి కచ్చితంగా వాళ్ల ని టార్గెట్ గా చేసుకునే తీస్తారు కాబట్టి. యువతరం కథల్లో విషయం ఉన్నా.. లేకపోయినా.. కథనం లో సాగదీత ఉండకూడదు. చక్కని పాయింట్ ని పట్టుకున్న హిప్పీ దర్శకుడు టీఎన్‌ కృష్ణ కథనం ఇంకొంచెం వేగంగా ఉండేలా చూసుకుంటే బావుండేదనిపిస్తుంది.

ఇక కథేమిటంటే..


హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఎప్పుడు ఏద‌నిపిస్తే అది చేస్తూ, స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే ర‌కం. స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు.

ఇక్కడనుంచి హిప్పీకి అసలు బాధ మొదలవుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా.. విడిపోయారా? ఇవన్నీ తెరమీద చూడాల్సిన విషయాలు..


ఎలా ఉంది...

అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకోవడం.. తర్వాత స్పర్థలతో విడిపోవడం ఇటువంటి కథలు తెలుగులో కోకొల్లలుగా వచ్చాయి. ఇదీ దాదాపు అలాంటిదే అయినా.. కేవలం యువతను టార్గెట్ గా చేసుకుని.. స్పష్టంగా వారి ఉద్రేకాల్ని, ఉద్వేగాల్నీ ఆకట్టుకునే అంశాలను కథనంలో కలగలిపి వండి వార్చిన సినిమా హిప్పీ. ఇటువంటి సినిమాలపై ఎక్కువగా లెక్కలు వేయడానికేమీ ఉండదు. సినిమా యూనిట్ లక్ష్యం స్పష్టం ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగిందా అనేది ఒక్కటీ మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆ కోణంలో సినిమా చాలా వరకూ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. సింపుల్ లైన్ కథలో యువతకు నచ్చే కొన్ని డైలాగులు.. మరి కొన్ని బోల్డ్ సీన్ లు.. కథనంలో సరిగ్గా అతుక్కున్నారు. అందుకే వారి టార్గెట్ కి సినిమా రీచ్ అయినట్టే. కాకపోతే ద్వితీయార్థం లో సాగదీతే కొంచెం ఇబ్బంది పెడుతుంది. కథనంలో దర్శకుడి శైలి బాగుంది.

ఎవరెలా చేశారు?

ఆర్‌ఎక్స్‌ 100లో ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. ఇక చెప్పుకోవాల్సింది హీరోయిన్ గురియించె. హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్‌ షోతోను యూత్‌ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నీకల్ గా..

కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్‌ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్‌ ఫీలింగ్‌ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా.. బోల్డ్ గా లక్ష్యం చేరిన హిప్పీ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories