మోహన్ బాబు కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు

Submitted by arun on Sun, 01/21/2018 - 11:45
Mohan Babu

మోహన్ బాబు కామెంట్స్ పై రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు ఆయన మాటల్లోని స్ఫూర్తిని గ్రహించి.. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని చెబుతుండగా... మరికొన్ని పార్టీలు మాత్రం.. మోహన్ బాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ అలా కామెంట్ చేయడం సరికాదంటున్నాయి. రాజకీయాల్లో 95 శాతం రాస్కెల్సే అన్న మోహన్ బాబు ఛీత్కారాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు మాటలను ప్రజల్లో పేరుకుపోతున్న అభిప్రాయాలుగా చూడాలని ఆంధ్రా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన మాటల్ని ఓ సవాలుగా తీసుకొని.. అన్ని పార్టీల నాయకులందరూ స్పందించాలని కూడా రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. 

మోహన్ బాబు కామెంట్లు నేరుగా టీడీపీని తాకినట్టే కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు.. ప్రజల చేత ఎన్నిక కాలేదని, ప్రజల చేత ఎన్నికైతే.. నాయకుడిగా ఎదగడంలో సాధక బాధకాలు తెలిసి ఉండేవని.. ఆయన అలా మాట్లాడతారని ఊహించలేకపోయామని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  ఇక వైసీపీ నేత పార్థసారథి కూడా దాదాపు అదే తరహాలో స్పందించడం విశేషం. రాజకీయాల్లో ఎదగాలనుకునేవారు వ్యక్తిగత జీవితాన్ని, ఆస్తులను కోల్పోవాల్సి వస్తుందని.. ఇలాంటివి మన కళ్లముందే కనిపిస్తున్న వాస్తవాలని వైసీపీ నాయకుడు పార్థసారథి అభిప్రాయపడ్డారు. కొంతమంది నేతలు తప్పుడు పనులు చేసినా.. అందరినీ  అదే గాటన కట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పార్థసారథి అన్నారు. 

మొత్తానికి మోహన్ బాబు కామెంట్లతో పలు రాజకీయ పార్టీల నాయకులు స్పందించాల్సి రావడం మంచిదేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నవారిలో జవాబుదారీతనం పెంపొందించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాలను బట్టి పాత్రలను మార్చినట్టుగా.. రాజకీయాల్లో డైలాగులు మారిస్తే ప్రజలు అంగీకరించరని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మోహన్ బాబు పెద్దరికానికి తగినట్టుగా మాట్లాడితే బాగుంటుందని వారంటున్నారు. త్యాగాలు చేయకపోతే రాజకీయ నాయకులుగా ఎదగలేరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ అభిప్రాయపడుతున్నారు.

English Title
Mohan Babu, Comments, Politicians

MORE FROM AUTHOR

RELATED ARTICLES