నిజామాబాద్ ఎన్నిక విధుల్లో 33 వేల మంది సిబ్బంది

నిజామాబాద్ ఎన్నిక విధుల్లో 33 వేల మంది సిబ్బంది
x
Highlights

నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక రోజుకో రికార్డును స్పష్టిస్తోంది. దేశంలోనే అతి పెద్ద బ్యాలెట్ యూనిట్‌తో ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి...

నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక రోజుకో రికార్డును స్పష్టిస్తోంది. దేశంలోనే అతి పెద్ద బ్యాలెట్ యూనిట్‌తో ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్ధులు భారీగా ఉండటంతో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఇక భద్రత పరంగా 6వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

నిజామాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే ఇదే తరహాలో విధానాలను అనుసరించేలా ఏర్పాట్లు చేసింది. బరిలో ఉన్న 185 అభ్యర్ధుల వివరాలను తెలియజేస్తూ ఒక్కో పోలింగ్ బూత్‌లో ఎం 3కి చెందిన 12 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేసింది. 12 ఈవీఎంలపై ఏ అభ్యర్ధి ఎక్కడున్నారు ? ఏ గుర్తు అనేదానిపై ఇప్పటికే అవగాహన కల్పించారు.

నిజామాబాద్ లోక్‌సభ స్ధానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఐదు నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండగా జగిత్యాల జిల్లా పరిధిలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంట్ ఎన్నిక కోసం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు మొత్తం 21 వేల 456 ఎం-3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా మూడు ఈవీఎంలను అదనంగా అందుబాటులో ఉంచారు.

నిజామాబాద్ లోక్ సభ పరిదిలో మొత్తం 15 లక్షల 52 వేల 733 మంది ఓటర్లు ఉండగా 185 మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్దులు ఏడుగురు ఉండగా 178 మంది రైతు అభ్యర్దులున్నారు. వీరికి గుర్తులు కేటాయించిన ఈసీ ఇందుకు అనుగుణంగా ఈవీఎంపై అభ్యర్ధులు, గుర్తులు ముద్రించి ఈ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చనుంది. ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే సూచనలు ఉండటంతో పోలింగ్‌ను గంట పాటు పొడిగించారు. ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఓటింగ్ అనంతరం ప్రక్రియ కూడా సుదీర్ఘంగా ఉంటంతో సిబ్బందిని భారీగా పెంచారు. సుమారు 33 వేల మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్టు ఈసీ తెలియజేసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత సీల్ వేసే వరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. పోలింగ్ పక్రియలో పారదర్శకత కోసం వెబ్ కాస్టింగ్ తో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలు, ఓటర్ల ఇబ్బందులు, అభ్యర్ధుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో నిజామాబాద్ ఖరీదైన ఎన్నికగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories