మక్కామసీదు కేసులో తీర్పు నేడు

Submitted by arun on Mon, 04/16/2018 - 10:42
Mecca Masjid blast case

మక్కా పేలుళ్ల కేసు కొలిక్కి వచ్చింది. ఇవాళ తుది తీర్పు రాబోతోంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తీర్పు వెలువడనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు ఎలా వచ్చినా హైదరాబాద్‌ మహానగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. 14మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న మక్కా పేలుళ్లపై దాదాపు 11ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది.

హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌‌లో నమోదైన ఈ కేసు దర్యాప్తును ఎన్‌‌ఐఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత ముస్లిం ఉగ్రవాద సంస్థల పనిగా భావించారు. దాంతో కొందరు ముస్లిం యువకులను అరెస్ట్‌చేసి ఛార్జిషీట్‌ దాఖలుచేశారు. అయితే మక్కా బ్లాస్ట్‌తో వీళ్లకి సంబంధం లేదని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. మహారాష్ట్ర మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా మొత్తం 11మందిపై కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేల్చింది. అలాగే మొత్తం 226 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించింది. అయితే 60మంది సాక్షులను మాత్రమే కోర్టు విచారించింది.

2013 జూన్‌ 28న దాఖలుచేసిన సప్లిమెంటరీ ఛార్జిషీటులో ఏ1గా దేవేందర్‌ గుప్తా, ఏ2గా లోకేష్‌ శర్మ, ఏ3గా సందీప్‌డాంగే, ఏ4గా రామచంద్ర కళాసంగ్రా, ఏ5గా సునీల్‌ జోషి, ఏ6గా స్వామి అసిమానంద, ఏ7గా భరత భాయి, ఏ8గా రాజేందర్‌ చౌదరి, ఏ9గా తేజ్‌రామ్‌ పరమార్, ఏ10గా అమితచౌహాన్‌‌లను చేర్చింది. హిందూ దేవాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు బుద్దిచెప్పటమే... వీరి లక్ష్యమని అభియోగ పత్రాల్లో పేర్కొంది.

ఇవాళ తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో నిందితులంతా కోర్టుకు హాజరుకానున్నారు. దాంతో నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పుకు ముందు, తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

English Title
Mecca Masjid blast case verdict today

MORE FROM AUTHOR

RELATED ARTICLES