వివాదంలో క్రిష్‌ చిత్రం!

వివాదంలో క్రిష్‌ చిత్రం!
x
Highlights

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన పద్మావత్‌ వివాదం మరువక ముందే మరో చారిత్రక చిత్రం వివాదంలో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే...

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన పద్మావత్‌ వివాదం మరువక ముందే మరో చారిత్రక చిత్రం వివాదంలో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాను రాజస్థాన్‌ సర్వ బ్రాహ్మణ్‌ మహాసభ (ఎస్‌బీఎం) వ్యతిరేకిస్తోంది. ఇందులో ఝాన్సీ లక్ష్మీబాయ్‌కి, బ్రిటీష్‌ వ్యక్తికి మధ్య ప్రేమ బంధాన్ని చూపిస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తోంది.

‘రాజస్థాన్‌లోని కొన్ని ప్రదేశాల్లో ‘మణికర్ణిక’ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాను విదేశీయులు రాసిన పుస్తకం ఆధారంగా తీసి, మహారాణి పేరు ప్రతిష్ఠల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్రీకరణ జరిపిన ప్రాంతాల్లో ఉన్న మా స్నేహితుల ద్వారా ఈ విషయం తెలిసింది. మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌కు ప్రేమబంధం ఉందని తప్పుగా ఊహించడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఆమె యుక్త వయస్కురాలిగా ఉన్నప్పుడు దేశం కోసం బ్రిటీష్‌ వారితో పోరాడారు. ఆమె జీవితంపై ఎలాంటి సినిమా తీసినా.. అది కచ్చితంగా బయోపిక్కే అవుతుంది’ అని ఎస్‌బీఎం అధ్యక్షుడు సురేశ్‌ మిశ్రా అన్నారు. నిర్మాతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ను తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇదే పని ‘పద్మావత్‌’ విషయంలో చేసుంటే ఇన్ని ఆందోళనలు జరిగేవి కావని చెప్పారు. ఈ వివాదంపై మణికర్ణిక టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories