ఏదో అనాలనుకుంటారు...మరేదో అనేస్తారు

ఏదో అనాలనుకుంటారు...మరేదో అనేస్తారు
x
Highlights

ఏదో అనాలనుకుంటారు. మరేదో అనేస్తారు. ఏది అనకూడదో, ఏది అంటే ప్రత్యర్థులకు పండగో, అదే అనేస్తారు. మాట తూలేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడే సిద్దరామయ్య...

ఏదో అనాలనుకుంటారు. మరేదో అనేస్తారు. ఏది అనకూడదో, ఏది అంటే ప్రత్యర్థులకు పండగో, అదే అనేస్తారు. మాట తూలేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడే సిద్దరామయ్య తూటాలకు, ఏం చెయ్యాలో దిక్కుతోచని కాషాయం నేతలకు, అమిత్ షా మాటలు మరింత కలవరం పుట్టిస్తున్నాయి. ఆల్రెడీ ఇమేజ్‌కు ప్యాచప్‌ చేసుకుని, బుద్దిమంతుడిలా కనిపించేందుకు ట్రై చేస్తున్న యడ్యూరప్పకు, సొంత పార్టీ అధ్యక్షుడే డ్యామేజ్‌ చేస్తున్నాడు.

కర్ణాటక ఎన్నికల్లో కాషాయం నేతలు తెగ తడబాడుతున్నారు. మొన్న ప్రెస్‌మీట్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌ షా, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కొంపముంచే పని చేశారు. అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాలకు పోటీ పెడితే యడ్యూరప్ప సర్కారే నెంబర్‌ వన్‌ అవార్డు సాధిస్తుందని, సుప్రీం కోర్టు రిటైర్డ్‌ చెప్పాడని, నోరు జారారు అమిత్‌ షా. సిద్దరామయ్య సర్కారు అనబోయి, అన్యాపదేశంగా యడ్యూరప్ప అనేశారు. దీంతో పక్కనే ఉన్న యడ్యూరప్ప తెల్లమొహం వేశారు.

ఇక కాంగ్రెస్‌ వెంటనే, అమిత్‌ షా తడబాటును తనకు అనుకూలంగా మలచుకుంది. అమిత్‌ షా నిజమే చెప్పాడని, యడ్యూరప్ప అవినీతిలో మునిగితేలిన విషయాన్ని, ఒప్పుకున్నాడని సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున, అమిత్‌ షా ప్రచారాన్ని చాలా బాగా స్టార్ట్‌ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. అమిత్‌ షా నోరుజారిన వీడియోను, కాంగ్రెస్‌ నేతలు అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఇక తాజాగా మరోసారి అమిత్‌ షా ప్రసంగం, పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. అయితే ఈసారి తప్పు మాత్రం, అమిత్‌ షా ప్రసంగాన్ని అనువాదం చేసిన నేతది. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమిత్ షా ప్రసంగాన్ని ప్రహ్లాద్‌ జోషి అనువదించారు. ప్రధాని మోడి దేశాన్ని సర్వనాశనం చేస్తారు దళితుల, పేదలకు ఆయనకు చేసిందేమీ లేదు దేశాన్ని నాశనం చేయడం ఖాయమంటూ అనువాదం చేశారు. దీంతో ర్యాలీకి వచ్చిన ప్రజలు, నేతలు విస్తుపోయారు. మొత్తానికి కర్ణాటకలో సిద్దరామయ్య వ్యూహాలకు ఒకవైపు యడ్యూరప్ప ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అమిత్‌ షాతో పాటు అనువాదకులు చేస్తున్న మిస్టేక్స్‌ మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అయితే తాను పొరపాటుగా మాట్లాడినా, కన్నడ ప్రజలు మాత్రం పొరపాటు చేయరని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ముక్తాయించారు అమిత్‌ షా.

అమిత్‌ షానే కాదు, ఎన్నికల ప్రచారంలో నోరుజారిన నేతలెందరో. ఆవేశంగానో, అనాలోచితంగానో, టంట్‌ స్లిప్పయిన నాయకులు ఎందరో, మరెందరో.

టంగ్‌ స్లిప్‌ కావడంలో, రాహుల్‌ గాంధీ కూడా తక్కువేం తినలేదు. అమిత్‌ షా పొరపాటుగా మాట్లాడిన విషయాన్ని, ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ, వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న రాహుల్‌, గతంలో లెక్కలేనన్నిసార్లు, నాలుక మడతెట్టేశారు. ఇంతకీ రాహుల్‌ గాంధీ, ఎన్నికల ప్రచారంలో తడబడిన మాటేది.

బెంగళూరు. కర్ణాటక రాజధాని. అదే ఒక సిటీ. అందులో మరిన్ని సిటీలేమీ లేవు. కానీ బెంగళూరులోని అనేక సిటీలున్నాయన్న అర్థంవచ్చేలా మాట్లాడారు రాహుల్‌ గాంధీ. కర్ణాటకలోని అన్ని సిటీలు అనబోయి, బెంగళూరులో అన్ని సిటీలన్నారు. అంతేకాదు, ఇందిర క్యాంటీన్లు అనబోయి, అమ్మ క్యాంటీన్‌ అన్నారు. వెంటనే సవరించుకుని, ఇందిర క్యాంటీన్‌ అన్నారు. దీంతో వేదిక మీదున్న సీఎం సిద్దరామయ్యతో పాటు పార్టీ నేతలందరూ షాక్‌ అయ్యారు.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ నోరుజారిన నేతలు చాలామంది ఉన్నారు. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికలతో పాటు చాలాచోట్ల లోకేష్‌ బాబు లెక్కలేనన్నిసార్లు నోరు జారారు. జారుతూనే ఉన్నారు. మొత్తానికి తుపాకీలోని తూటా, నోటిలోని మాట, గురిలేకుండా బయటికవచ్చాయంటే, చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. అందుకే ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మరింత జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే ప్రత్యర్థుల చేతుల్లో ఆయుధమైపోతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories