దారి తప్పిన బస్సు..బస్సు దిగకుండా యాత్ర పూర్తి చేస్తున్న పీసీసీ చీఫ్

దారి తప్పిన బస్సు..బస్సు దిగకుండా యాత్ర పూర్తి చేస్తున్న పీసీసీ చీఫ్
x
Highlights

ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్ర నామ్ కే వాస్తేగా మారింది. జిల్లా పర్యటనల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్...

ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్ర నామ్ కే వాస్తేగా మారింది. జిల్లా పర్యటనల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సు దిగకుండా యాత్ర కానిచ్చేస్తున్నారు. సభలకు వేదిక ఎక్కడం.. దిగడం.. తప్ప జనంతో మమేకం కావడం లేదని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడుతాం..ప్రజల్లోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం.. నాలుగేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలివి. మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర చేపట్టారు. అయితే ప్రజల్లోకి వెళ్లాలనే లక్ష్యం గురి తప్పిందనే విమర్శలు పార్టీలోనే వెల్లువెత్తున్నాయి.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా నేతలు సభలకే పమితమవుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లి వాళ్లెదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోకుండా పీసీసీ అధ్యక్షుడు కేవలం సభలకు.. బస్సు ప్రయాణానికి పరిమతమవుతున్నడనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఉదయం బస్సెక్కి.. మధ్యాహ్నం సభకు హాజరు కావడం.. ఆ తర్వాత రాత్రి సభలో వేదిక నెక్కడంగా బస్సుయాత్ర సాగుతోందని పార్టీలో చెప్పుకుంటున్నారు.

గ్రూపులు, వివాదాలతో జిల్లాల్లో పార్టీ అస్తవ్యస్తంగా ఉంది. బస్సుయాత్రలో ఆయా వివాదాలను పరిష్కరించాలని నేతలు నిర్ణయించారు. కానీ అది ఎక్కడా జరగడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఆ ప్రయత్నం చేసినట్లే కనిపించలేదని పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ వివాదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పీసీసీ చీఫ్ బస్సుయాత్రను వాయిదా వేసుకొని గొడవలు యాత్రకు అడ్డంకి కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.

పార్టీలో వివాదాల పరిష్కారం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రజా చైతన్య బస్సుయాత్ర లక్ష్యం. కానీ బస్సుయాత్ర ఆ దిశగా సాగడం లేదనే టాక్ వినిపిస్తోంది. అనుకున్న లక్ష్యాలు సాధించకుండానే యాత్ర ముగింపు దశకు రావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి యాత్ర మాకెందుకని కొందరు భావిస్తున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories