రాహుల్‌‌ నాయకత్వంపై మరోసారి నీలినీడలు ..?

రాహుల్‌‌ నాయకత్వంపై మరోసారి నీలినీడలు ..?
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ మథన పడుతున్నారా ? తాను అధికార పగ్గాలు చేపట్టాక తొలి సారి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా...

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ మథన పడుతున్నారా ? తాను అధికార పగ్గాలు చేపట్టాక తొలి సారి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడాన్ని తనకు తానే తీవ్రంగా పరిగణిస్తున్నారా ? ఓటమికి బాధ్యత వహిస్తూ క్షేత్ర స్ధాయి నేతలు చేస్తున్న రాజీనామాలతో రాహుల్ ఆందోళన చెందుతున్నారా ? దారుణ ఓటమికి తాను కూడా కారణమని భావిస్తున్నారా ?

కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో బీజేపీ దేశ వ్యాప్తంగా బలపడుతున్న వేళ కాంగ్రెస్‌‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తల్లి నుంచి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల విజయం సాధించి తన సత్తా చాటారు. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు రాహుల్‌‌ నాయకత్వంపై మరోసారి నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

ప్రధాని మోడీ , బీజేపీ టార్గెట్‌గా ఎన్నికల ప్రచారం సాగించిన రాహుల్ తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన న్యాయ్ పథకాన్ని ప్రతి సభలోనూ వివరించారు. ఇదే సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును ప్రస్తావిస్తూ ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాదిపైనే దృష్టి సారించిన రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, గెలుపు అవకాశాలున్న చోట సత్తా చాటేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సోదరి ప్రియాంకా గాంధీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించి ఎన్నికల ప్రచారంలోకి దింపారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కల్పించడమే లక్ష్యంగా ప్రియాంక సుడిగాలి పర్యటనలు నిర్వహించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే అధికారం కథ దేవుడెరుగు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. గడిచిన ఎన్నికలతో పోల్చుకంటే 5 చోట్ల అధికంగా విజయం సాధించి 52 స్థానాలకు చేరుకుంది. ఇందులో కేరళ, పంజాబ్‌, తమిళనాడుల్లోనే 31 స్థానాలను దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఏపీలో ఒక శాతం ఓటు కూడా సాధించలేకపోయింది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు నిర్వహిస్తున్న వర్కింగ్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పార్టీ ఘోర పరాజయం పాలు కావడం, సీనియర్ నేతలు సైతం ఇంటి దారి పట్టడం, అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపలేకపోవడానికి నైతిక బాధ్యత వహించాలని రాహుల్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియోజకవర్గం అమేథిలో తానే పరాజయం పాలు కావడం, బలమైన ఉత్తర ప్రదేశ్‌లో 1 స్ధానానికి పరిమితం కావడంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తన స్ధానంలో సోదరి ప్రియాంకా గాంధీని లేదా పార్టీలో విధేయుడిగా ఉన్న వ్యక్తికి పగ్గాలు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి,. అయితే ఇవన్నీ ఒట్టి ఊహగానాలేనంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామంటున్న నేతలతో పరాజయం పాలు కావడంపై క్షేత్ర స్ధాయి నుంచి విశ్లేషిస్తామంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే CWC సమావేశంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories