ఇచ్చిన మాట కోసం సొంత ఆస్తినే అమ్మిన జడ్పీటీసీ

Submitted by arun on Wed, 09/19/2018 - 11:41
zptc

ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు. ప్రభుత్వం అండగా లేదనో అధికారులు సహకరించడం లేరనో తప్పించుకునేవారే ఎక్కువగా ఉంటారు. కానీ అలా కాకుండా ప్రజలకిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు ఏకంగా సొంత ఆస్తినే అమ్మింది ఓ జడ్పీటీసీ. అంతేకాదు అలా వచ్చిన డబ్బుతో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. 

ఈమె పేరు శైలజారెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల జడ్పీటీసీ మెంబర్‌. నిన్న ఆమె మడికట్టు గ్రామంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 3 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. జేసీబీతో పనులను మొదలు పెట్టారు. అయితే ఈ రోడ్డు పనుల ప్రారంభం వెనుక శైలజారెడ్డి ఇచ్చిన మాట ఉంది. తాను జడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేశారు. అయితే ఆనాటి ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. కానీ ఆమె ఇచ్చిన వాగ్ధానాల అమలు మాత్రం కాలేదు. చాలా కాలం నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ సర్కారు నుంచి సాయం రాలేదని ఆమె ఊరుకోలేదు. ఇచ్చిన మాట కోసం ఏకంగా సొంత ఆస్తినే అమ్మేశారు. 

చేవెళ్ల నుంచి బీజాపూర్‌ వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న తన ప్లాట్ను అమ్మగా 22 లక్షలు వచ్చాయి. అలా వచ్చిన డబ్బుతో చేవెళ్ల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మడికట్టు గ్రామంలో 3 లక్షలతో రైతులు పొలాలకు వెళ్లే మార్గాన్ని జేసీబీతో చదునుచేశారు. అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు. ఇచ్చిన మాట కోసమే తాను ఈ ప్రయత్నం చేస్తున్నానన్న శైలజారెడ్డి చేవెళ్ల మండలం అభివృద్ధే తన ధ్యేయం అని అన్నారు. 

జడ్పీటీసీ శైలజారెడ్డిని మడికట్టు గ్రామస్తులు అభినందిస్తున్నారు. తన సొంత డబ్బులతో రోడ్డు వేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదనే డైలాగ్‌ను వల్లెవేసే రాజకీయనాయకులకు కొదువ లేని మన రాష్ట్రంలో దాన్ని తూచా తప్పకుండా పాటించిన జడ్పీటీసీ శైలజారెడ్డిని ప్రశంసిస్తున్నారు. 

Development works launched at Chevella

English Title
Lady ZPTC sell her flat to fulfil poll promises!

MORE FROM AUTHOR

RELATED ARTICLES