బుట్టాకు అధిష్టానం పిలుపు?

x
Highlights

పార్టీ మారుతున్నట్టు వార్తలు రంగంలోకి దిగన జగన్ బుజ్జగించేందుకు ప్రయత్నం చర్చనీయాంశంగా రేణుక నిర్ణయం కర్నూలు(మనం న్యూస్ బ్యూరో): కర్నూలు...

  • పార్టీ మారుతున్నట్టు వార్తలు
  • రంగంలోకి దిగన జగన్
  • బుజ్జగించేందుకు ప్రయత్నం
  • చర్చనీయాంశంగా రేణుక నిర్ణయం

కర్నూలు(మనం న్యూస్ బ్యూరో): కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడంతో వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగి బుజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నేరుగా ఆమెకు ఫోన్ చేసి హైదరాబాద్‌కు వచ్చి కలవాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె జగన్ ఆహ్వానాన్ని మన్నించి కలుస్తారా? లేదా? అన్న ప్రశ్నార్థకంగా మారింది. 2014లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసి బుట్టా రేణుక విజయం సాధించారు. అయితే గెలిచిన కొన్ని రోజులకే ఆమె టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆమె భర్త బుట్టా నీలకంఠం వార్తలను నిజం చేస్తూ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బుట్టా రేణుక కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంతలో వైసీపీ అధినేత జగన్, మరికొంత మంది ముఖ్యనేతలు రంగంలోకి దిగి ఆమె టీడీపీలో చేరకుండా అడ్డుకున్నారు. భర్త మాత్రం టీడీపీలో చేరిపోయారు.

రేణుక మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కోడుమూరులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజామా? కాదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్టీ మారే విషయం కుటుంబంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని, ముందు మీకు చెప్పిన తర్వాతే చేరుతా అని చెప్పారు. దీంతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ పెద్దలతో పలుమార్లు చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఆమె డిమాండ్లకు టీడీపీ పెద్దలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో దసరాలోపు ఆమె టీడీపీలో చేరుతారని ఆమె వర్గీయులే చెబుతున్నారు. వైసీపీని వీడుతున్నట్టు వార్తలు రావడంతో జగన్ నేరుగా రంగంలోకి దిగారు. బుట్టా రేణుకకు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే జగన్‌ను కలుస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్‌ను కలిస్తే ఆ పార్టీలో కొనసాగుతారని, వెళ్లకపోతే టీడీపీలోకి వెళ్లడం ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories