తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:52

తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని ఆరోపించారు. ఇది కేవలం తననే కాకుండా రాష్ట్రంలోని బీసీలను, తెలంగాణ మహిళలు అందరినీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ అన్నది కల్వకుంట్ల ఇల్లు కాదన్నారు. తెలంగాణను కల్వకుంట్ల వారి ఇల్లుగా మార్చుతానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి, తన భర్త మురళీకి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారనీ.., ఆ మాటను ఇప్పటివరకూ నిలబెట్టుకోలేదని  కొండా సురేఖ ఆరోపించారు. తాము వరంగల్ లో రెండు సీట్లు డిమాండ్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి పొమ్మని చెప్పలేక తమకు పొగపెట్టారని ఆమె విమర్శించారు. తమ ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మండిపడ్డారు. 105 అభ్యర్థుల జాబితా తర్వాత కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం పార్టీలోకి రావడం హరిశ్ రావుకు ఇష్టం లేదనీ తనకు పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం కేటీఆరేనని సురేఖ స్పష్టం చేశారు.

మాకు టిక్కెట్‌ రాకుండా చేసింది కేటీఆరేనని కొండా సురేఖ ఆరోపించారు.  కేటీఆర్‌ మా వెంట ఎప్పుడూ లేరని మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కేటీఆరేననన్నారు. భూపాలపల్లి టిక్కెట్‌ విషయంలో 10 మందిలో ఒక్కరిగా మమ్మల్ని చూడాలని మాత్రమే కోరామన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌కు ఫోన్‌ చేశాను.. స్పందించలేదని పేర్కొన్నారు. నాకు టిక్కెట్‌ ఇవ్వక పోవడానికి కారణమేంటో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. పార్టీ స్పందనను బట్టి మా నిర్ణయం ఉంటుందన్నారు. అవసరమైతే భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్ లో తమ కుటుంబం పోటీ చేస్తుందని సురేఖ స్పష్టం చేశారు.

పరకాల వదిలి వరంగల్ ఈస్ట్ కు వెళ్లాలని తమకు ఇష్టం లేకపోయినా పార్టీ కోసం వెళ్లామని స్పష్టం చేశారు కొండా దంపతులు, వరంగల్ ప్రజలు 55 వేలమెజారిటీతో ఆశీర్వదించారని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ఈస్ట్ లో కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామని అయినా తమకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో టీఆర్ఎస్ అధిష్ఠానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు కేబినెట్ లో చోటు ఇవ్వని ప్రభుత్వంగా కేసీఆర్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  తనకు మంత్రి పదవుల మీద ఆశ లేదనీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే చాలని స్పష్టం చేశారు.

English Title
Konda Surekha Couple Press Meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES