కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు

Submitted by arun on Sat, 08/11/2018 - 17:13
kerala heavy rains

కేరళపై వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. వరుణుడి ఉగ్రరూపానికి కేరళలోని చాలా జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది.  దీంతో సగం కేరళ వరద గుప్పిట్లోనే చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 11జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అతలాకుతలమైన కేరళలో కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది.  

కుండపోత వాన కట్టలు తెంచుకున్న వరదతో కేరళ చిన్నాభిన్నమైంది. గ్రామాలను వర్షం నీరు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడగా మరికొన్ని చోట్ల ఇళ్లు కూలి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.  సైన్యం, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా మరో 36గంటలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కేరళ వ్యాప్తంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా 24 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.

నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరగడంతో ఆసియాలోనే అతి పెద్దదైన ఇడుక్కి రిజర్వాయర్ గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రాజెక్ట్ నుంచి దిగువకు విడుదల చేసే నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండటంతో దిగువున ఉన్న ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరదల ఉధృతికి కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోగా చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడి రవాణా వ్యవస్థ స్తంభించింది.

ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావం ప్రమాదకరంగా మారింది.  పరిస్థితి చేయి దాటు తుండటంతో ఇడుక్కి, కోజికోడ్, మలపురం, జిల్లాలలో జాతీయ విపత్తు నివారణా దళం, నౌకా, సైనిక దళాలకు చెందిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో  సైనిక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇటు భారీ వర్షాలతో కొచ్చి విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

కేరళలో వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వరద పరిస్థితిపై సమీక్షించిన కేరళ సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద పరిస్థితులపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం కేరళ వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

English Title
kerala heavy rains

MORE FROM AUTHOR

RELATED ARTICLES