ముంపు తెచ్చిన ముప్పు...వైపరీత్యాన్ని అంచనా వేయలేదా?

Submitted by arun on Sat, 08/18/2018 - 16:28
cmpinarayi

కేరళలో జల విలయానికి కారణాలేంటీ ? ఎడతెరపి లేని వర్షాలకు వరద నీరు తోడయిందా ? నదులు, డ్యాంలు నిండిపోయి నీళ్లు రావడమే కారణమా ? వరదలను ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయిందా ? సర్కార్‌ ముందే మేల్కొని ఉంటే ఇంతలా ప్రాణ నష్టం జరిగేది కాదా ? భారీగా నదులు, ఉప నదులు ఉన్నా కేరళ అతలాకుతలమైంది ? కేంద్రం కూడా సకాలంలో స్పందించలేదా ? ఎందుకిలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

ప్రకృతి అందాలు చల్లని వాతావరణం ఎత్తయిన కొండలు ఎటు చూసినా పరచినట్లు ఉండే పచ్చదనం ఇలా వర్ణించుకుంటే పోతే కేరళ గురించి ఎంతయినా చెప్పొచ్చు. 14 జిల్లాలున్న కేరళ రాష్ట్రంలో 44 నదులు, 55 ఉప నదులు, 80 డ్యాములు ఉన్నాయ్. వీటికి తోడు పెద్ద కాలువలు 30 పైగా ఉన్నాయ్. అంతేనా అంటే బ్యాక్‌ వాటర్‌ను నిల్వ చేసేందుకు 15 కిలోమీటర్ల పొడవున్న కెనాల్స్, వాగులు, వంకలు లెక్క లేనన్ని ఉన్నాయ్. ఎన్ని ఉన్న కేరళ మాత్రం వరదల నుంచి బయట పడలేకపోయింది. ప్రకృతి ప్రకోపం ముందు తలవంచక తప్పలేదు. దీనికి తోడు ప్రమాదం ఇంతలా ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఊహించలేదు. 

సాధారణంగా కేరళలోకి రుతుప్రవేశాలు ప్రవేశించిన తర్వాత జూన్‌లో 16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. కంటిన్యూ‌గా వర్షాలు పడటంతో ఎత్తయిన కొండలు వర్షాలకు నానడంతో మట్టి కరిగిపోయింది. దీంతో జలవిలయం మరింత పెరిగింది. రెండు నెలల క్రితమే కేరళలో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులన్ని నిండిపోయాయి. ఇలాంటి సమయంలో మళ్లీ అంత స్థాయిలో వర్షం కురిస్తే ప్రమాదం తప్పదని ప్రభుత్వ యంత్రాంగం ముందుగా పసిగట్టలేకపోయింది. అందుకు తగ్గట్టుగా సర్కార్ సిద్ధం కాలేదు. కానీ ఊహించని విధంగా ఎన్నో రెట్లు అధికంగా వర్షపాతం నమోదైంది.

ఇలాంటి ప్రకృతి విపత్తులు, వరదల లాంటివి వచ్చినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లు గతంలో పటిష్టమైన చర్యలు తీసుకొని ప్రాణ, ఆస్థినష్టాలను తగ్గించగలిగారు. కానీ కేరళ సీఎం పినరయి విజయన్ ఈ విషయంలో విఫలం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్‌ చేసి మానటరింగ్ చేస్తే ఇంత పళయం సంభవించి ఉండేది కాదని అంటున్నారు విశ్లేషకులు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయ్. ప్రభుత్వం, అధికారుల అలసత్వంతోనే మృతుల సంఖ్య పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. 

సైక్లోన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించినా విస్త్రతంగా చర్యలు చేపట్టలేకపోయింది. కేవలం కేంద్రానికి విజ్ఞప్తి చేసి వారి సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కూడా వేగవంతంగా చేయకపోవడంతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం చేయలేకపోయింది. వర్షాలు పెరుగుతున్నా సహాయక చర్యలు ముమ్మరంగా చేయకపోవడంతో కేరళ అతలాకుతలానికి కారణమైంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ లేఖ రాసే వరకు కేంద్రం కూడా స్పందించలేదు. కేరళ సర్కార్‌ నుంచి లేఖ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 80 టీంలను సహాయక చర్యలు చేపట్టేందుకు పంపింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

English Title
Kerala CM Pinarayi Vijayan neglect on floods

MORE FROM AUTHOR

RELATED ARTICLES