చల్లారని చంద్రగిరి చిచ్చు...సంచలన విషయాలు బయటపెట్టిన ద్వివేదీ

చల్లారని చంద్రగిరి చిచ్చు...సంచలన విషయాలు బయటపెట్టిన ద్వివేదీ
x
Highlights

ఏపీలో రీ పోలింగ్‌ రగడ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై టీడీపీ నేతల ఆందోళన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు....

ఏపీలో రీ పోలింగ్‌ రగడ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై టీడీపీ నేతల ఆందోళన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మొత్తం 19 నియోజకవర్గాల్లో రీ పోలింగ్ ‌నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కంప్లైంట్‌పై సీఎస్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయగా చంద్రగిరిలో జరిగిన దారుణాలను ద్వివేది బయటపెట్టడం సంచలనంగా మారింది.

చంద్రగిరి చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఈసీ వైసీపీ ఫిర్యాదుపై ఎందుకు స్పందిస్తోందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయంపై టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు సచివాలయంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 చోట్ల రీ పోలింగ్‌ జరపాలని ఫిర్యాదుచేశారు. నరసరావుపేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని పలు కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే టీడీపీ నాయకుల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికార పార్టీ ఇచ్చిన వినతిని పరిశీలించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోట్‌ పంపారు. చెవిరెడ్డి ఫిర్యాదు మాదిరిగానే టీడీపీ విజ్ఞప్తిని పరిశీలించాలని సిఫార్సు చేశారు.

మరోవైపు చంద్రగిరి పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది సంచలన విషయాలు బయటపెట్టారు. పోలింగ్ నాటి వీడియో ఫూటేజీ చూస్తే అక్కడి దారుణాలు తెలుస్తాయని మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంగా ద్వివేది తెలిపారు. ఎప్రిల్‌ 11 న జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రిగ్గింగ్‌కు పాల్పడినట్లు అర్థం అయ్యిందని తెలిపారు. పోలింగ్‌ సక్రమంగా జరగలేదనే నిర్ధారణకు వచ్చాకే పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేశామని అక్కడి అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుచేసినట్లు తెలిపారు.

మరోవైపు టీడీపీ నాయకులు అంటున్నట్లుగా రెండుసార్లు రీ పోలింగ్‌ జరగకూడదని ఎక్కడైనా ఉందా అని ద్వివేది ప్రశ్నించారు. మా దృష్టికి వచ్చినప్పుడు ఫిర్యాదులను పట్టించుకోకుండా పక్కన పెట్టాలా అని అన్నారు. టీడీపీ ఫిర్యాదు చేసిన బూత్‌లలో ఉన్న సీసీ ఫూటేజీని కూడా పరిశీలించామని అన్ని వివరాలు చెప్పేందుకు కోర్టుకైనా వస్తానని తేల్చిచెప్పారు. చంద్రగిరిలో కొన్ని పోలింగ్‌కేంద్రాల్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్న రీతిలో ఎన్నికలు జరిగాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories