ఉత్తమ్‌కు గట్టిపోటీనిచ్చేందుకు గులాబీ బాస్‌ వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:24
kcruttam

కేసీఆర్‌ తమ అభ్యర్థులను ప్రకటించని మరో రెండు కీలక నియోజకవర్గాలు హుజూర్‌ నగర్, కోదాడ. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలివి. ఉత్తమ్‌కు చెక్‌పెట్టాలని రకరకాల వ్యూహాలు వేస్తున్న గులాబీ బాస్, వీటికి అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ స్థానాలకు క్యాండెట్స్‌ను ప్రకటించకపోవడానికి కారణమేంటి....ఈ రెండు నియోజకవర్గాలపై కేసీఆర్‌ గురి ఏంటి? 

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్‌ సీఎం రేసులో వినిపిస్తున్న పేరు. హుజూర్‌ నగర్‌ నుంచి రెండు సార్లు గెలిచారు ఉత్తమ్. దీంతో అందరి దృష్టి హుజూర్‌ నగర్‌పై పడింది. ఉత్తమ్‌కు చెక్‌ పెట్టాలని, ఎన్నో వ్యూహాలు వేస్తున్న కేసీఆర్, ఈ స్థానానికి మాత్రం ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించలేదు. 2014లో ఉత్తమ్‌పై, తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి, కాసోజు శంకరమ్మను నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయారు. దీంతో ఈసారి శంకరమ్మకు బదులు, మరొకరికి టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్‌, అందుకే అభ్యర్థి పేరు ప్రకటించలేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. శంకరమ్మకే టిక్కెట్‌ ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో, ఇప్పుడే క్యాండెట్‌ను ఫైనల్‌ చేస్తే, వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో తొలి జాబితాలో చేర్చలేదు కేసీఆర్. అంతేకాదు, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మరో బలమైన క్యాండెట్‌ను పోటీలో నిలపాలని భావిస్తున్నారు.

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ను నిలువరించాలని స్ట్రాటజీలు వేస్తున్న కేసీఆర్‌, రెండు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అందులో ఎన్‌ఆర్‌ఐ శానంపూడి సైదిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కెనడాలో హోటల్ బిజినెస్ లో ఉన్న శానంపూడి సైది రెడ్డిని, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ దించాలని కేసిఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో పనిచేసుకోవాల్సిందిగా శానంపూడి సైదిరెడ్జికి, కొంతకాలం కిందటే కేసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు సైదిరెడ్డి. ముఖ్యంగా యువతను తనవైపు ఆకర్షించేందుకు యువ సమ్మేళనాలు ఆర్గనైజ్‌ చేస్తున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించని మరో నియోజకవర్గం కోదాడ. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మావతి. ఈమె ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సతీమణి. 2014లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని, స్కెచ్‌ వేస్తున్న కేసీఆర్, సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవలె టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత చందర్‌ రావు, టిక్కెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే మరో టీడీపీ నేత పొన్నం మల్లయ్య యాదవ్‌ టీఆర్ఎస్‌లో చేరుతాడన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ కూడా కోదాడ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కోదాడలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో ఎవరిని బరిలోకి దింపాలా అని కేసీఆర్‌ తర్జనభర్జనపడుతున్నారు. హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌కు, కోదాడలో ఆ‍యన సతీమణి పద్మావతికి చెక్‌ పెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను గట్టిదెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తున్న కేసీఆర్‌, రానున్న రోజుల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని కసరత్తు చేస్తున్నారు.

English Title
KCR Puts Uttam Kumar Into Suspense

MORE FROM AUTHOR

RELATED ARTICLES