logo

ముందస్తు ఎన్నికలకు సంకేతాలిచ్చిన సీఎం కేసీఆర్...డిసెంబర్‌లో ...

తెలంగాణలో ముందస్తు మేఘాలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పరోక్షంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలిచ్చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం వేదికగా నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయినట్లే కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలని టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు పిలుపునిచ్చారు. ముందస్తుకు మానసికంగా సిద్ధం కావాలని కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేదీ తనకు కూడా తెలియదని, ఎప్పుడైనా జరగొచ్చని, పార్టీ నేతలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలపై తుది నిర్ణయం తనదేనని కేసీఆర్ తేల్చి చెప్పారు.

ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు సానుకూలంగా ఉన్నాయని కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశంలో గుర్తు చేశారు. ఎన్నికలు ఎఫ్పుడొచ్చినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రేపా, ఎల్లుండా, ఆ తర్వాతా అనే అంశం చూడకుండా సన్నద్ధంగా ఉండాలని నేతలను ఆదేశించారు.

సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తానని గులాబీ బాస్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రగతి నివేదన సభలోనే ఎన్నికల భేరీ మోగిద్దామని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం వచ్చే నెలలో పెద్ద ఎత్తున జరిగే జరిగే సభకు 25 లక్షల మంది హాజరయ్యేలా నేతలు కృషి చెయ్యాలని కోరారు. అయితే డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్‌ మొదటివారంలోనే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం సెప్టెంబర్ 10లోగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తేనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల కమిషన్ కు వంద రోజుల వరకు సమయం అవసరమవుతుంది. రాజ్యాంగ నియమాల ప్రకారం ఆరు నెలలలోపు ప్రభుత్వం ఏర్పడాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 10 లోపు అసెంబ్లీ రద్దు చేసినప్పుడే ఎన్నికలు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లైవ్ టీవి

Share it
Top