నేటి నుంచి కేసీఆర్ తుది ప్రచారం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:03

అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ఇక మిగిలింది ప్రచారమే. ఇవాళ్టి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రచార పర్వం షురూ కానుంది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, యాగ నిర్వహణలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇక నుంచి ఎన్నికల కధన రంగంలోకి దూకనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంలో జరిగే ప్రచార సభకు హాజరుకానున్నారు. ఖమ్మం మొదలు ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 

ఇవాళ ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి.. ఖమ్మంలో ఒకే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వెంటనే పాలకుర్తికి వెళ్లి అక్కడ జరిగే సభలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. రేపు నాలుగు చోట్ల జరిగే సభల్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత నవంబర్‌ 25 వరకు వరుసగా జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. మధ్యలో ఈ నెల 24 న ప్రచారానికి బ్రేక్‌ ఇవ్వనున్నారు. 

21 న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్‌, భువనగిరి, మెదక్ లో‌, 22 న ఖానాపూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, ముథోల్‌, ఆర్మూర్‌ లో, 23 న నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామలో 25 న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం సభల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కేసీఆర్‌ వస్తున్న సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

సెప్టెంబర్‌ 6 న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్‌ ఆ తర్వాతి రోజున హుస్నాబాద్‌ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత నిజామాబాద్‌, నల్లగొండ, వనపర్తి సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు జరగడంతో ప్రచారానికి విరామం ప్రకటించారు. ఇటు నామినేషన్ల గడువు కూడా ముగుస్తుండటంతో ఇవాళ్టి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. 

English Title
KCR Election Campaign To Start from Today

MORE FROM AUTHOR

RELATED ARTICLES