రూటు మార్చిన సీఎం కేసీఆర్

రూటు మార్చిన సీఎం కేసీఆర్
x
Highlights

మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. మాటల తూటాలను పక్కన బెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా ప్రచారం చేపట్టారు. పేద...

మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. మాటల తూటాలను పక్కన బెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా ప్రచారం చేపట్టారు. పేద ప్రజలు, రైతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రసంగించిన కేసీఆర్‌ మరో సారి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. కులం వద్దు మతం వద్దు అంటూనే ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త వరాలను ప్రకటించారు.

ఖమ్మం సభతో మలి విడత ప్రచారం మొదలు పెట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక ప్రసంగం చేశారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో సహజశైలికి భిన్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఒక స్ధానానికే పరిమితమైన టీఆర్ఎస్‌ను ఈసారి పది స్ధానాల్లో గెలిపించాలంటూ జిల్లా ప్రజలను కోరారు.

చెంతనే గోదారి ఉన్నా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్‌లే కారణమన్న కేసీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డుపడ్డారంటూ ఆరోపించారు. మన వేలితో మన కన్ను పొడిచే ప్రయత్నం జరుగుతోందన్న ఆయన మరో సారి తెలంగాణ వాదాన్ని రగిల్చేలా ప్రసంగించారు.

దేశంలోనే రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టినన్ని పనులు ఎవ్వరూ చేపట్టలేదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యంత ధనవంతులుగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పి తమను ఆశీర్వదించాలంటూ కోరారు. కులం, మతం చూస్తే నష్టపోతామన్న కేసీఆర్ పోరాడి సాధించుకున్న రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలపై విపక్షాల విమర్శలను ప్రస్తావించిన కేసీఆర్‌ ఒక్క రూపాయి భారం పడకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. కాంగ్రెస్ హాయంలో హౌసింగ్ స్కీం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌‌గా మారితే తమ హాయంలో సంక్షేమానికి చిరునామాగా మారిందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఇసుక విక్రయం ద్వారా 10 కోట్ల ఆదాయం వస్తే తమ నాలుగేళ్ల పాలనలో రెండు వేల యాభై కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇలా వచ్చిన ఆదాయంతోనే 412 సంక్షేమ పథకాలు చేపట్టామంటూ ప్రజలకు వివరించారు.

ఖమ్మం సభ అనంతరం పాలకుర్తిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కేసీఆర్ స్ధానిక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. దేవాదులను పూర్తి చేసి జిల్లాకు వంద టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తూనే పాలకుర్తికి డిగ్రీ కాలేజ్‌ మంజూరు చేస్తామంటూ హామి ఇచ్చారు. కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా స్ధానిక సమస్యలు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతులను ఆయన ప్రస్తావించారు. మహాకూటమిపై గతంలో తీవ్రస్దాయిలో విరుచుకుపడిన కేసీఆర్‌ ఈ సారి విమర్శల పదును తగ్గించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories