రివ్యూ: కర్తవ్యం

రివ్యూ: కర్తవ్యం
x
Highlights

నిర్మాణ సంస్థ‌లు: నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి ట‌్రైడెంట్ ఆర్ట్స్‌ తారాగ‌ణం: న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌, రామ‌చంద్ర‌న్ దురైరాజ్‌, జీవా ర‌వి...

నిర్మాణ సంస్థ‌లు: నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి ట‌్రైడెంట్ ఆర్ట్స్‌
తారాగ‌ణం: న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌, రామ‌చంద్ర‌న్ దురైరాజ్‌, జీవా ర‌వి సును ల‌క్ష్మి, మ‌హాల‌క్ష్మి, వేళ రామూర్తి, త‌దిత‌రులు
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఓం ప్ర‌కాశ్
కూర్పు: గోపి కృష్ణ‌
నిర్మాత‌లు: శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: గోపి నైన‌ర్‌


ఓ పక్క కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది నయనతార . తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'అరం' అక్కడ ప్రేక్షకాదరణ పొందింది. అదే చిత్రాన్ని 'కర్తవ్యం' పేరుతో తెలుగులో అనువదించారు. వాస్తవానికి ఈ మూవీ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సినిమా మీద ఉన్న నమ్మకంతో సోమవారం నాడు ప్రీమియర్‌ షోలను ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

క‌థ‌: నెల్లూరు జిల్లా వెల‌నాడు గ్రామం స‌హా చుట్టు పక్క‌ల గ్రామాలు తాగు నీరు లేకుండా అల‌మ‌టిస్తుంటాయి. ప్ర‌జ‌లు తాగు నీరు కోసం కిలోమీట‌ర్ల దూరం వెళుతుంటారు. వెల‌నాడు గ్రామంలో బుల్ల‌బ్బాయ్ (రామ‌చంద్ర‌న్ దొరైరాజ్‌), సుమ‌తి(సునుల‌క్ష్మి) అనే కూలీ చేసుకుని పొట్ట పోసుకునే దంపతుల‌కు ఓ ప‌న్నెండేళ్ల కొడుకు, ఐదేళ్ల కుమార్తె ఉంటారు. ఊరి కౌన్సిల‌ర్ మూయ‌కుండా వ‌దిలేసిన బోరు బావిలో అడుకుంటున్న చిన్నారి ధ‌న్సిక(మ‌హాల‌క్ష్మి) ప‌డిపోతుంది. ఆ పాపను కాపాడ‌టానికి ఎవ‌రూ స‌రైన స‌మ‌యానికి రాలేరు. విష‌యం తెలుసుకున్ని జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ధు వ‌ర్ధిని (న‌య‌న‌తార‌) ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి అక్క‌డి ప‌నుల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తుంది. అగ్ని మాప‌క సిబ్బంది.. ఆర్మీ బృందం చేసిన చ‌ర్య‌లు కూడా ఫ‌లించ‌వు. దాంతో మ‌ధు వ‌ర్ధిని అనుహ్య నిర్ణ‌యాన్ని తీసుకుంటుంది. ఆ నిర్ణ‌యమేంటి? దాని కార‌ణంగా మ‌ధు వ‌ర్ధిని ఎలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొంది? అధికారులు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు ఎలా అడ్డుప‌డ‌తారు? వారికి స‌మాధానం చెప్ప‌డానికి మ‌ధు వ‌ర్ధిని ఎలాంటి అడుగు వేస్తుంది? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు : పూర్తిగా తమిళ నేటివిటితో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్క నయనతార మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. సినిమా పూర్తిగా నయనతార పాత్ర చుట్టూ నడవటంతో ఎక్కడా మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగదు. నయనతార తనదైన నటనతో సిన్సియర్‌ కలెక్టర్‌ పాత్రకు ప్రాణం పోసింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో మధువర్షిణి పాత్రలో జీవించింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు సహజంగా నటించారు. కొత్తవారే అయినా ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు.

విశ్లేషణ : గ్రామీణ ప్రాంతాల్లో నీటికోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ఎంచుకున్న దర్శకుడు గోపి నైనర్‌ ఆ కథకు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ జోడించి సినిమాను నడిపించాడు. అనవసరమైన కామెడీ, కమర్షియల్ సన్నివేశాలను ఇరికించకుండా సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఎక్కడా సినిమా చూస్తున్న భావన కలగకుండా నిజంగా జరిగిన సంఘటనను చూస్తున్నామనిపించేలా సాగింది కథనం. ఒక పక్క అంతరిక్షంలోకి రాకెట్‌ లను పంపుతున్నా వంద అడుగుల బావిలో పడ్డ పాపను కాపాడేందుకు సరైన పరిజ్ఞానం లేని పరిస్థితులను ఆలోచింప చేసే విధంగా ఎత్తి చూపించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, రాజకీయనాయకులు తప్పులను కూడా ఎత్తి చూపించారు. జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు, ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువుల బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నయనతార నటన
ఎమోషనల్‌ సీన్స్‌
కథా కథనం

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవటం

Show Full Article
Print Article
Next Story
More Stories