సీఎల్పీ విలీనం తర్వాత ప్రతిపక్ష హోదా ఎంఐఎంకే..?

సీఎల్పీ విలీనం తర్వాత ప్రతిపక్ష హోదా ఎంఐఎంకే..?
x
Highlights

ఇక త్వరలోనే టీఆర్ఎస్‌ ఎల్పీలోకి సీఎల్పీ విలీనం తర్వాత శాసనసభలో పరిస్థితి ఏంటి..? ప్రతిపక్షంగా ఏ పార్టీ వ్యవహరించబోతోంది..? అసలు ప్రతిపక్షమే లేకుండా...

ఇక త్వరలోనే టీఆర్ఎస్‌ ఎల్పీలోకి సీఎల్పీ విలీనం తర్వాత శాసనసభలో పరిస్థితి ఏంటి..? ప్రతిపక్షంగా ఏ పార్టీ వ్యవహరించబోతోంది..? అసలు ప్రతిపక్షమే లేకుండా శాసనమండలి దారిలోనే అసెంబ్లీని నడిపిస్తారా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా దొరుకుతుంది.. మజ్లీస్‌. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరికొన్ని రోజుల్లోనే సీఎల్పీ టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి.. విలీనం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ నేతలతో ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో అధికార పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలైనా గులాబీ మార్చుకుంటే సరి విలీనం ప్రక్రియ లాంఛనంగా పూర్తికానుంది.

అదే కనుక జరిగితే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఆ హోదాను కోల్పోతుంది. ఆ సమయంలో కాంగ్రెస్‌ కంటే టీఆర్ఎస్‌ మిత్రపక్షం అయిన ఎంఐఎం దగ్గరే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా కనిపించేది ఆ ఒక్క పార్టీ మాత్రమే. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్రతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 11 మంది కలిపి మొత్తం టీఆర్ఎస్‌కు ప్రస్తుతం102 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్దతు పలికితే ఆ సంఖ్య 104 కు చేరుతుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ బలం.. ఆరుకు పడిపోతోంది. అప్పుడు సభలో రెండో అతిపెద్ద పార్టీగా మజ్లీస్‌ అవతరించనుంది.

దీంతో అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్లూ అధికార పార్టీకి మద్దుతుగా ఉన్న మజ్లీస్‌ అన్నీ కుదిరితే త్వరలోనే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏదైనా అంశంపై మాట్లాడే సందర్బంలో అన్ని పార్టీల కన్నా ఎంఐఎం పార్టీకే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కౌన్సిల్‌లో ఇద్దరు సభ్యులతో రెండో పెద్దపార్టీగా ఉన్న మజ్లీస్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంటే టీఆర్ఎస్‌కు అంశాల వారీగా మద్దతిస్తున్న ఆ పార్టీ ప్రజా సమస్యలపై ఏ మేరకు అధికార పార్టీ తీరును ఎండగడుతుందో చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories